Munugodu | చండూరు, మార్చి 27 : మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ సరిపోవడం లేదు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన కట్కూరి నర్సింహ అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు.
రెండు బోర్లు ఉండగా ఒకటి పూర్తిగా ఎండిపోయింది. మరొక బోరు ఆగి ఆగి పోస్తున్నది. దాంతో ఇప్పటికే కొంత సగం ఎండడంతో పశువుల మేతకు వదిలిపెట్టాడు. మిగిలిన పంట అయినా చేతికి వస్తే కొంత ఊరట లభిస్తుందని ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి పోస్తున్నాడు. రోజుకు రూ.2వేల నుంచి 3వేల వరకు ఖర్చు వస్తున్నట్లు నర్సింహ తెలిపారు. బోడంగిపర్తి గ్రామంలో 384 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇప్పటికే 48 ఎకరాలు ఎండిపోయింది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి వచ్చిందని రైతులు చెప్తున్నారు. పంట ఎండిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
నీళ్లు లేక నాలుగెకరాలు ఎండింది
తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత నాటి కేసీఆర్ ప్రభుత్వం చెరువుల్లో పూడిక తీయడంతో పదేండ్ల పాటు నీళ్లకు ఢోకా లేదు. పంటలు బాగా పండించుకున్నాం. ఈ యాసంగిలో నాది, మా తమ్ముడి భూమి కలిపి ఎనిమిదెకరాల్లో వరి నాటు పెట్టిన. బోర్లల్లో నీళ్లు లేక నాలుగు ఎకరాలు ఎండింది. చేసేది లేక గొర్లు, మేకలను మేపుతున్నా.
-తోటకూరి యాదయ్య, రైతు, బోడంగిపర్తి