దామరచర్ల, జనవరి 06 : మిర్యాలగూడ క్లస్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో సాగులో ఉన్న మిరప తోటలను మంగళవారం సందర్శించారు. రైతు ధీరవత్ మాలు 3.20 ఎకరాల్లో సాగు చేస్తున్న తేజశ్రీ రకం మిర్చిని పరిశీలించి సస్యరక్షణ సలహాలు- సూచనలు అందించారు. మిరప పంటలో ప్రధానంగా తామర పురుగు, రిజాక్టోనియా విల్ట్ తెగులు వ్యాపిస్తుంది కావున యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల తెగులు నివారించవచ్చు అన్నారు.
– తామర పురుగులను తట్టుకోగలిగే అందుబాటులో ఉన్న రకాలు సాగు చేయవలెను
– మిర్చి పంట సీజన్ ఆగస్టులో నాటుకోవడం వల్ల పూత సమయంలో తామర పురుగులు ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చు
– అంతరకృషి చేయడం ద్వారా మట్టిలోని కోశస్త దశలను నివారించవచ్చు
– మిరపలో మొక్కజొన్న/జొన్న అలాగే బొబ్బెరను అంతరపంటగా 10:3:1వరుసల్లో వేసుకోవలెను
– ఇమిడక్లోప్రిడ్ 8 గ్రాములు/kg విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయవలెను
– మొక్కను ప్రధాన పొలంలో నాటిన 15 రోజుల తర్వాత ఫిప్రోనిల్ 10 గ్రా. గుళికలు నేలకు అందించాలి
– జిగురు అట్టలను నీలి రంగు ఎకరానికి 40- 50 చొప్పున పంట ఎత్తులో ఏర్పాటు చేయాలి
– సాధ్యమైనంత వరకు పురుగు మందులను పిచికారీ చేయకుండా బదులుగా మొక్క ఆధారిత పురుగు మందులను అయిన NSKE @5: లేదా వేప నూనె 3:@2ml/లీటర్ లేదా కానుగ నూనె 3ml/లీటరు వావిలి సారం మొదలైనవి లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.
ఈ కార్యక్రమంలో కల్లేపల్లి గ్రామ సర్పంచ్ రజిత మల్లు నాయక్, సక్రు, ఏఈఓ ప్రియాంక, ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ సాయి పాల్గొన్నారు.