నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పొలాల మీదుగా వరద పొంగి పొర్లడంతో పంటలు మునిగిపోయి తీవ్ర నష్టం వాలిల్లింది. పత్తి చేలల్లో నీళ్లు నిలువడం వల్ల పంట పండు మరింత దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. వరి పైర్లు ఇప్పటికే కుళ్లిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ అంచనాలు తీస్తే పంటల నష్టం భారీగా ఉండనుంది.
గత రెండ్రోజుల నష్టానికి సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా రూపొందించింది. మొత్తం పొలంలో 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతింటేనే అధికారులు పరిగణలోకి తీసుకుని అంచనాలు వేశారు. ఆ మేరకు నల్లగొండ జిల్లాలో ఆరు మండలాల్లోని గ్రామాల పరిధిలో వరి, పత్తి, మిర్చి పైర్లు దెబ్బతిన్నాయి. 455 మంది రైతులకు సంబంధించిన 648 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇందులో 377 మంది రైతులకు సంబంధించిన 555 ఎకరాల్లో వరి , 75 మంది రైతులకు చెందిన 90 ఎకరాల పత్తి, ముగ్గురు రైతులది మూడెకరాల మిర్చి పంటకు నష్టం వాటిల్లినట్లు సోమవారం వెల్లడించారు. దామరచర్ల మండలం వాడపల్లిలో 100 ఎకరాల్లో వరి, 20 ఎకరాల్లో పత్తి, మాడ్గులపల్లి మండలం కల్వలపాలెంలో రెండెకరాల్లో వరి, వేములపల్లి మండలంలో మొత్తం వరి పంటే దెబ్బతింది. ఇటిక్యాలలో 45 ఎకరాలు, మునగపహాడ్లో 58, శెట్టిపాలెంలో 47, ఆమనగల్లో 95, చలిచీమలపాలెంలో 35, రావులపెంటలో 40, తిమ్మారెడ్డిగూడెంలో 20, వేములపల్లిలో 30, సల్కనూర్లో 50 ఎకరాల్లో నష్టం జరిగింది.
గుర్రంపోడు మండలంలోని పార్లపల్లిలో మూడెకరాల్లో మిర్చి, పెద్దవూర మండలం చలకుర్తిలో మూడెకరాల్లో వరి, చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 30 ఎకరాల్లో వరి, 70 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో పేర్కొన్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి అంచనాలు రూపొందించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్‌కుమార్ తెలిపారు. రహదారులకు జరిగిన నష్టంపైన పంచాయతీరాజ్ విభాగం అంచనాలు వేస్తున్నది. ఇప్పటివరకు ఆరు రోడ్లు దెబ్బతిన్నట్లుగా రూ.1.07 కోట్ల నష్టం జరిగినట్లుగా పేర్కొంది.
నల్లగొండ నుంచి ఖాజీరామారం, చిన్నాయిగూడెం-కాశివారిగూడెం, కల్వలపాలెం-సల్కనూర్, ఇందిరమ్మకాలనీ-భోజ్యానాయక్‌తండా, తక్కెళ్లపాడు-పాలేరువాగు వరకు పీఆర్ రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో విభాగానికి సంబంధించిన లక్ష రూపాయల వరకు కరెంటు స్తంబాలకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖలు కూడా నష్టం అంచనాలు వేసే పనిలో ఉన్నాయి. త్వరలో వివిధ విభాగాల వారీగా పూర్తి స్థాయి అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో…
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 16 మండలాల పరిధిలో 19,696 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. అత్యధికంగా వరి 14,120 ఎకరాల్లో ఉంది. పత్తికి 5,576 ఎకరాల్లో నష్టం జరిగింది అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజవర్గాల్లో నష్టం అత్యధికంగా ఉంది. కోదాడ నియోజవర్గంలో 13,476 ఎకరాలు, హుజూర్నగర్ నియోజవర్గంలో 4,770 ఎకరాలు, సూర్యాపేట నియోజకవర్గంలో 1,450 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. తుంగతుర్తి నియోజకవర్గంలో పంట నష్టం లేదని చెబుతున్నారు. వరద తీవ్రత ఇంకా ఉన్నందున రెండ్రోజుల్లో పూర్తి స్థాయిలో నష్టం వివరాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.