– నల్లగొండలో హోరెత్తిన ‘జన జాగరణ యాత్ర’ భారీ బైక్ ర్యాలీ
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వినతిపత్రం
– ఆగస్టు 23న ‘చలో హైదరాబాద్’ భారీ బహిరంగ సభ
– టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపు
రామగిరి, జూలై 15 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. జన జాగరణ యాత్ర నల్లగొండకు చేరుకున్న సందర్భంగా పానగల్ ఫ్లై ఓవర్ చౌరస్తా నుండి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వరకు ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా, ఓపీఎస్ పునరుద్ధరణకు అనుకూలంగా ఉద్యోగులు చేసిన నినాదాలతో నల్లగొండ పురవీధులు హోరెత్తాయి. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జిని కలిసి సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నూతన పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ తదనంతర జీవితానికి పాత పెన్షనే భరోసా ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సీపీఎస్ రద్దు పోరాటంలో భాగంగా రాబోయే ఆగస్టు 23వ తేదీన రాజధాని నగరంలో ‘చలో హైదరాబాద్’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాల్వల శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిఖార్జున్, రాష్ట్ర కార్యదర్శులు సోమనాథ్, అనిల్, రాష్ట్ర నాయకులు వెంకట్, మన్నూరు అంజన్ పాల్గొన్నారు. అలాగే నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా నాయకులు పుల్లయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఫరూక్, షఫీతో పాటు వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.