నీలగిరి, మే 05 : పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు పరిచేంత వరకు సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ టీఎస్ సీపీఎస్ ఈయూ (TSCPSEU) ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలోని స్థానిక రెవెన్యూ భవన్లో నిర్వహించిన సీపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. సిపీఎస్ ఉద్యోగులారా ఏకమై ఐక్యతతోనే అన్యాయమైన సిపీఎస్ విధానాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు నిర్వహించాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనలో రాజీ పడొద్దని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికులా పని చేయాలని కోరారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ఘడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సిపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ప్రభుత్వం ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని స్థాయిలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేయాలన్నారు. అనంతరం ఏకగ్రీవంగా నల్లగొండ జిల్లా సీపీఎస్ అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ కన్వీనర్ గా పతంగి కరుణాకర్ గౌడ్, కో కన్వీనర్లుగా ఎండీ ఈడ్రెస్, ఎన్.యాదవ చారి, బీసీఎస్పీ, ఎస్టీ, మైనారిటీ అన్ని గురుకులాల నుండి కె.మధు బాబు, బాలస్వామి ఫరూక్, డా. విక్రమ్ రెడ్డి, ఇఫ్తకార్, ఎస్.రవికుమార్, సైదయ్య, కృష్ణను వివిధ శాఖల నుండి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, రాష్ట్ర నాయకుడు పున్న సోమనాథ్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.