నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 01 : నల్లగొండ మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం శ్రేణులు స్థానిక తాసీల్దర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తాసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండ అనురాధ, మండల ప్రధాన కార్యదర్శి నల్పరాజు సైదులు మాట్లాడుతూ.. నల్లగొండ నుండి ముషంపల్లి వరకు తవ్వి వదిలేసిన రోడ్లను వెంటనే నిర్మాణం చేయాలని, వెలుగుపల్లి నుండి రసూల్ పురం మీదుగా దుప్పలపల్లి బైపాస్ వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని, జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారం. పీడబ్ల్యూడీ రోడ్డు నుండి అన్నారెడ్డిగూడెం మీదుగా తొరగల్లు రోడ్డు వరకు, శ్రీరాంపురం నుండి అన్నపర్తి గ్రామానికి రోడ్డు బాగు చేయాలని, గుండ్లపల్లి రోడ్డు నుండి నర్సింగ్ బట్ల వరకు, కంచనపల్లి నుండి బుద్ధారం మీదుగా అప్పాజీపేట వరకు తవ్విన రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చందనపెళ్లి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించి రాములబండ గ్రామములో పీహెచ్సీలో పడకల సామర్థ్యం పెంచి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, యూరియా అందించాలని అలాగే ఉపాధి హామీ పనులను పెండింగ్ విడుదల చేయాలన్నారు. మహిళలకు రుణాలు ఇవ్వాలని, సీజనల్ వ్యాధుల పట్ల అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, దోమల మందు పిచికారి చేయాలని, బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండా వెంకన్న, బొల్లు రవీందర్ కుమార్, జిల్లా అంజయ్య, బోల్లోజు భారతమ్మ, కండే యాదగిరి, మల్లెబోయిన లింగస్వామి, మానపాటి ఎల్లయ్య, వెలుగు రాములు, భూతరాజు మహేశ్, జాగాటి మురళీధర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Nalgonda Rural : గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని తాసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా