నల్లగొండ, అక్టోబర్ 28 : ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఖమ్మంకు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ 100 సంవత్సరాల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్మించిందని, దేశ స్వతంత్ర పోరాటంలో అగ్ర భాగాన నిలిచిందని, తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. సిపిఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎల్ఐసిలో ఉన్న రూ.33 వేల కోట్ల ప్రజల బీమా సొమ్మును సంక్షోభంలో ఉన్న అదానీ కంపెనీకి కట్టబెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ఎల్ఐసీలో దేశ ప్రజల సొమ్మును అదానీకి ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన వరి ధాన్యం, పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరి, పత్తి తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. వరి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడానికి రైతులకు సరైన వసతులు కల్పించాలన్నారు. అదేవిదంగా సిపిఐ శతాబ్ది బహిరంగ సభ విజయవంతం కోరుతూ జిల్లా వ్యాప్తంగా నవంబర్ 17 నుండి చేపట్టిన సిపిఐ జాతను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి ఉజ్జిని యాదగిరి రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు మల్లేపల్లి అది రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, గురిజ రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు, బోల్గురి నర్సింహ, నల్పరాజు రామలింగయ్య, తీర్పాటి వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.