దామరచర్ల, జూన్ 26: వైటీపీఎస్ కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ఆపకుంటే ప్రజాపోరాటం తప్పదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఉదయ్‌కుమార్ హెచ్చరించారు. టెండర్లు రద్దు చేయాలని కోరుతూ ప్లాంటు ఉద్యోగుల జేఏసీకి మద్దతుగా శుక్రవారం ప్లాంటు మెయిన్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కొరతతో స్టేజ్ 1, స్టేజ్ 2లు మూడు సంవత్సరాలకు ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదన్నారు. విద్యుత్ సమస్యను అధికమించేందుకు గత ప్రభుత్వం వైటీపీఎస్ను ఏర్పాటు చేసిందన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు యూనిట్లను ప్రారంభించి.. ప్రభుత్వపరంగా ఉన్న ప్లాంటను ప్రైవేటుపరం చేయడంతో స్థానిక నిరుద్యోగులు, నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
ప్లాంటు నిరాహణకు 4 వేల మంది అవసరం ఉండగా కేవలం 1,262 మందితో పని చేయిస్తున్నారని చెప్పారు. దీంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని పేర్కొనడం సరికాదన్నారు. రెండేండ్లు గడుస్తున్నా ఉద్యోగులను నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. స్థానికంగా రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. ప్లాంటు ప్రైవేటీకరణను ఉపసహరించుకోకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, వెంకటేశ్, పవన్గాంధీ, కాశయ్య, రమేశ్‌బాబు, రాము, రవినాయక్, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.