మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి తోడ్పడేలా ఉన్నాయని మావోయిస్ట్ మాజీ నేత సత్యంరెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడేనికి చెందిన మావోయిస్ట్ మాజీ నేత గజ్జల సత్యంరెడ్డి 26 ఏండ్లు దండకారణ్యంలో, 17 ఏండ్లు కారాగారంలో గడిపి ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.
మంత్రితో భేటీ సందర్భంగా సత్యంరెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యయేలా బీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగనున్నట్లు చెప్పారు. తన ఉపాధి కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. సత్యంరెడ్డి ప్రజా జీవితంలోకి రావడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా రైతు విభాగ మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, బుచ్చిరెడ్డి ఉన్నారు.