నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ):ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన స్థానిక సం స్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలితో మళ్లీ బ్రేక్ పడింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా కాకుం డా జీవో ద్వారా ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధపడటంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జీవో నెంబర్ 9తోపాటు గురువారం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్పైనా హైకోర్టు స్టే విధించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
తదుపరి విచారణను ఆరు వారాల అనంతరం వాయిదా వేయడంతో అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. ‘గౌరవనీయులైన హైకోర్టు ఈ రోజు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది.’ అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రకటనతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలేవీ కనిపిస్తలేవు. దీంతో క్షేత్రస్థాయి నేతలతో పాటు ఆశావాహుల్లోనూ తీవ్ర నిరుత్సాహం ఆవరించింది.
గతేడాది జూలై మొదటి వారంలో జిల్లా, మం డల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగియ గా దాదాపు 15 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చిం ది. ఇన్నాళ్లూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అదిగో.. ఇదిగో.. అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించడంతో ఎన్నికల నిర్వహణ మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. గురువారం ఉదయం 10.30 గంటలకు తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా సాయంత్రానికి కోర్టు ఆదేశాలతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లు అధికారులు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో నల్లగొండ జిల్లాలోని 18 జడ్పీటీసీ, 197 ఎంపీటీసీ స్థానాలకు, సూర్యాపేట జిల్లాలోని 11 జడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు, యాదాద్రి జిల్లాలోని 10 జడ్పీటీసీ, 84 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నా మినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం ఉమ్మడి జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. దీం తో ఆశావాహలు తొలి రోజు నామినేషన్ పత్రా లు తీసుకెళ్తూ కనిపించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగితే నేడు లేదా రేపు నామినేషన్లు దాఖ లు చేయాలని భావించారు. అయితే నామినేషన్ పత్రాలు తీసుకెళ్లిన అనంతరం సాయం త్రం 4 గంటలకు హైకోర్టు ఆదేశాలతో అయోమయం నెలకొంది. చివరకు నోటిఫికేషన్పైనా స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆరు వారాల వరకు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు తీర్పు చెప్పడంతో అప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
నామినేషన్లు నామమాత్రం
తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించినా నామినేషన్లు మాత్రం నామ మాత్రంగానే దాఖలయ్యాయి. నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. ఎంపీటీసీ స్థానాలకు మాత్రం బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. యాదాద్రి జిల్లాలో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు రాలేదు. ఎంపీటీసీ స్థానాలకు మాత్రం 11 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యం లో అందరిలోనూ ఎన్నికలపై అనుమానాలే ఉన్నా యి. దీంతో ఆచితూచి వ్యవహారించేందుకే పార్టీ నేతలతో పాటు మెజార్టీ ఆశావాహులు మొగ్గుచూపారు.
అందుకే తొలి రోజు నామినేషన్ల పత్రాలు తీసుకోవ డం, దాఖలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీస్తూ ఎక్కువ మంది కనిపించారు. సాయంత్రానికి స్టే రావడంతో అందరికీ స్పష్టత వచ్చింది. అయితే హైకోర్టు స్టే నేపథ్యంలో ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలపైనా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు ఇచ్చిన స్టేను వెకెట్ చేయించడం లేదా పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడం, లేదా పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్ జారీ చేయడం, లేదా హైకోర్టులో కేసు తేలే వరకు ఎన్నికలు వాయిదా వేయడం అనే అంశాలు ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది.