దేవరకొండ రూరల్, అక్టోబర్ 17 : పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న పత్తి పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం దేవరకొండ సహాయ వ్యవసాయక సంచాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి రైతు తాను పండించిన పంట వివరాలను కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పంట వివరాలు నమోదు చేయాలో స్వయంగా రైతులకు చూపించారు. రైతులే స్వయంగా సిసిఐకి తమ పత్తి పంటను అమ్మి మద్దతు ధర పొందవచ్చు అని తెలిపారు. ఒకవేళ సరైన మొబైల్ నెంబర్ లేకపోతే ఏఈఓను సంప్రదించి సరైన నంబర్‌ను నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ రవికుమార్, ఏఈఓలు అభిలాష్, బాలాజీ, నీలిమ పాల్గొన్నారు.