చిట్యాల, జనవరి 9 : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని మార్కెట్లో అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. నిన్నమొన్నటి వరకూ నాణ్యత లేమి, తేమ పేరుతో కొర్రీలు పెట్టిన సీసీఐ కేంద్రాలు ఇప్పుడు ఉన్నఫళంగా కొనుగోళ్లు బంద్ చేసి రైతులను రోడ్డున పడేస్తున్నాయి. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కొక్కటిగా సీసీఐ సెంటర్లను బంద్ చేస్తుండడంతో పత్తి లోడ్లతో వచ్చిన రైతులు పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు అవస్థ పడుతున్నారు. వాస్తవానికి పత్తి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కొనుగోళ్లు చేపట్టాలని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలకు అందుకు విరుద్ధంగా అధికారులు ముందస్తుగానే కేంద్రాలను మూసేస్తున్నారు. గతంలో ఫిబ్రవరి వరకు నడిచిన సెంటర్లను ఇప్పుడు జనవరి రెండు వారంలోనే బంద్ పెడుతున్నారు. ఓ కేంద్రంలో నాణ్యత లేని పత్తి కొనుగోలు కారణంగా ఒక అధికారిపై చర్యలు తీసుకున్నారని, పత్తి తేవడం తగ్గిన కేంద్రాలను ఎంపిక చేసుకొని ఒక్కొక్కటిగా మూసేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారని సీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాలను మూసి వేసే ముందు వరకూ ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకపోవడంతో రైతులకు సమాచారం లేక పత్తి లోడ్లతో సీసీఐ సెంటర్లకు వస్తున్నారు.
తీరా రైతులు వచ్చాక ఒకటి రెండు రోజులకు కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు చెప్పడంతో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. చండూరుకు చెందిన ఓ రైతు అక్కడి అధికారుల సూచన మేరకు మునుగోడు ప్రాంతంలోని పత్తి మిల్లుకు వెళ్లగా, అక్కడా కొనుగోళ్లు నిలిపేసినట్లు చెప్పారు. చిట్యాలకు వెళ్లాలని సూచించడడంతో ఆ రైతు ఇక్కడికి వచ్చాడు. గురువారం ఇక్కడ కూడా కొనుగోళ్లు ఆపేసినట్లు చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఒక్కసారిగా కొనుగోళ్లను బంద్ పెట్టడంతో ఆగ్రహించిన రైతులు గురువారం చిట్యాల బస్టాండ్ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడి చేరుకుని ఆందోళన విరమింపజేసే క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ నాగరాజు, ఎస్ఐ ధర్మా రైతులతో కలిసి సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తాసీల్దార్ క్రిష్ణ, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి జానయ్య మాట్లాడడంతో ఎట్టకేలకు సాయంత్రానికి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న పత్తి లోడ్లను సీసీఐ అధికారులు మిల్లులోకి పంపించారు.
మా నాన్న అనారోగ్యంతో ఉన్నాడు. మేము ముగ్గురం ఆడ పిల్లలం. మా పత్తిని అమ్మడానికి రెండు రోజుల కింద చిట్యాలకు వచ్చి ట్రాక్టర్ దగ్గరే ఉంటున్నాను. ఈ రోజు కొనుగోళ్లను నిలిపివేసినట్లు సీసీఐ అధికారులు చెప్పారు. ట్రాక్టర్ కిరాయి రూ.4 వేలు. పత్తి అమ్మితే వచ్చిన డబ్బులు మా నాన్న వైద్యానికి ఉపయోగపడుతాయి అనుకున్నాను. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ఇలా లేదు.
పత్తి తీసుకుని చిట్యాలలోని సీసీఐకి వచ్చిన. రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నం. తీరా ఇప్పుడు పత్తి కొంటలేం అంటున్నారు. ఇది రైతుల మోసం చేయడమే. జనవరిలోనే ఎప్పుడూ కొనుగోళ్లు బంద్ పెట్టలేదు. పత్తి బాగా లేదని సాకులు చెప్తున్నరు. బాగాలేకపోతే తక్కువ ధర ఇచ్చి అయినా కొనాలే గానీ, అసలు కొనం అంటే రైతులు ఎక్కడ అమ్ముకోవాలి.