గుర్రంపోడు, నవంబర్ 10 : నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ-దేవరకొండ రహదారిపై రైతులు సోమవారం ఎడ్ల బండ్లతో తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోకో నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సమస్యల కారణంగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు (మద్దతు ధర కంటే చాలా తక్కువ) అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి పత్తి కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.