యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భువనగిరి ఆర్టీఏ కార్యాలయం లో అవినీతి పెట్రేగిపోతున్నది. అధికారుల అండతో దళారులు రాజ్యమేలుతున్నారు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహా రం ఉంది. వసూళ్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. పైసలు ముట్టజెబితే తప్ప.. ఫైల్ ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఎన్ని రకాల ఆన్లైన్ సేవలు వచ్చినా.. ఏదో ఒక కొర్రీ పెడుతుండటంతో ఆఫ్‌లైన్‌లో చేతులు తడపనిదే పని కావడం లేదు.
భువనగిరి పరిధిలోని అనంతారంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఉంది. 17 మండలాలకు చెందిన వాహనదారులు ఇకడికే వస్తుంటారు. ప్రతిరోజూ లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సరిఫికెట్లతో సహా వివిధ రకాల సేవల కోసం పెద్ద సం ఖ్యలో వాహనదారులు వస్తుంటారు. ప్రస్తు తం అనేక రకాల సేవలను ఆన్లైన్లో అందిస్తున్నారు. ఈ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించి తమకు కేటాయించిన తేదీల్లో సేవలు పొందొచ్చు. ఇక వాహనాల ఫిట్నెస్ను పరిశీలించేందుకు ఎం వీఐలు నేరుగా వెళ్లి చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంవీఐలు మాత్రం కార్యాలయ క్యాబిన్ దాటకుండానే పనులు కానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హోంగార్డులు, దళారులను రంగంలోకి దించి వసూళ్లు కొనసాగిస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయాల్లో పనులన్నీ కోడ్ భాష ల్లో నడుస్తాయనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. దళారులతో వాహనదారులకు డీల్ కుదిరాక.. వారు తెచ్చిన పత్రాలపై పెన్సిల్ లేదంటే పెన్నుతో ఒక కోడ్ రాస్తారు. ఫలానా అధికారిని కలవాలని దళారి చెబుతాడు. వాహనదారులు లోపలకు వెళ్లి సదరు ఉద్యోగిని కలిసిన వెంటనే కోడ్ చూసి పనిచేస్తాడు. ఇలా వచ్చే డబ్బును బట్టి లోపల ఉన్న సిబ్బందికి కమీషన్ల రూపంలో కొంత మొత్తం దళారి ముట్టజెప్పుతాడు. ఆయా కార్యాలయాల్లో ఉండే జిరా క్స్ సెంటర్లు కూడా అక్రమ వసూళ్లకు అడ్డాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అనేక పనుల కోసం నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. అయితే ఆన్‌లైన్‌పై చాలా మందికిలో అవగాహన లేకపోవడం..ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం, సమయం లేక బిజీగా ఉం డటం..తదితర కారణాలతో అనేక మంది ఏజెంట్లను ఆశ్రయిస్తుంటారు. ఎవరైనా నేరుగా వచ్చినా ఏదో కారణం చెప్పి అప్లికేషన్‌ను పెండింగ్‌లో పెడతారు. లేదా రిజెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక అనేక మంది దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరా చేసుకొని ఏజెంట్లతో కలిసి అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. అధికారులకు ప్రత్యేకంగా ఏజెంట్లు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి ఒక రేటు కట్టి వసూలు చేస్తున్నారు. చేయి తడపకపోతే ఫైలు ముందుకు కదలదు. డ్రైవింగ్ లైసెన్స్‌కు సరార్ ఫీజు, సర్వీసు ఛార్జీ దాదాపు వెయ్యి లోపే ఉంటుంది. కానీ నేరుగా వెళితే పని అవ్వదు. దీంతో దళారుల ద్వారా వెళితే రూ.4000 వరకు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అన్ని సేవలకు వేలకు వేలు వసూలు చేస్తున్నారు. సాయంత్రం కాగానే అటెండర్ నుంచి అధికారుల వరకు ఎవరి వాటాలు వాళ్లు పంచుకుంటారనే ప్రచారం ఉంది. ఇక భువనగిరి ఆర్టీఏ కార్యాలయ సమీపంలో పదుల సంఖ్యలో ఆన్లైన్ సెంటర్లు కనిపిస్తుంటాయి. ఇకడ సాధారణంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేయమని కోరితే చేయడం లేదు. దళారులు, అధికారుల ఫీజుతో మొత్తం అమౌంట్ చెల్లిస్తేనే పని ప్రారంభం అవుతుంది.