సూర్యాపేట, మే 12 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్యమైనట్లు తెలుస్తున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అక్రమాలు బయటపడిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఇందులో తమకు వాటా కావాలని పోలీసులు వచ్చారంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవినీతి జబ్బు పట్టగా ఆ అవినీతి పాపపు సొమ్మును తిలా పాపం తలా కొంచెం అన్న చందంగా భాగస్వాములైనట్లు తెలుస్తుంది. దీంతో అర్హత లేని డాక్టర్లు రోగులకు వైద్యం అందిస్తున్నట్లు, అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నట్లు ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణలో వెలుగులోకి వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక జిల్లా వైద్యశాఖకు చెందిన ఓ అధికారి మధ్యవర్తిత్వం వహించి నిర్వాహకుల నుంచి లక్షల్లో డబ్బులు ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో తమకు వాటా రావడం లేదేందని పోలీసులు కేసు నమోదు చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేస్తే స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడితో రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోవడం, డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏసీబీని ఆశ్రయిస్తే సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు అరెస్టు అయ్యారు. దీనిని బట్టి గత మూడు నాలుగేండ్లుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో అర్థమవుతున్నది. అవినీతి కోటను పెకిలించే వారే లేకుండా పోయారు.
గత మూడు నాలుగేండ్ల కాలంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు చివరకు ఆర్ఎంపీలను కూడా వదలకుండా పీడించి డబ్బులు వసూలు చేస్తుండగా దాదాపు రూ.12 కోట్ల వరకు అక్రమ సంపాదన చేసినట్లు సొంత శాఖ వారి ద్వారానే తెలుస్తున్నది. సస్పెండైన ఉద్యోగి జీతం ఇచ్చేందుకు లంచం.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిణుల వేతనాలు మింగేయడం, అర్హత లేని డాక్టర్లు రోగులకు వైద్యం అందిస్తున్నట్లు, స్కానింగ్ సెంటర్లు నడుపుతున్న వారి నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు… గత నెలలో ఎన్హెచ్ఎం నుంచి రూ.30,50,000, అలాగే ఫ్లెక్సీల ప్రింటింగ్ పేరిట రూ.4,71,420 కేంద్ర నిధులు రాగా మెజారిటీ స్వాహా చేశారు. చివరకు కోవిడ్ నిధులు కూడా వదలలేదనే ఆరోపణలు తెలిసిందే. వీటన్నింటిపైనా ఇటీవల 17వ తేదీన అలాగే నేడు జిల్లా కేంద్రంలో పలు తనిఖీలు చేసి శరత్ కార్డియాక్ సెంటర్లో అసలు డాక్టరే లేకుండా ఒక టెక్నీషియన్ ఉండి టెస్టులు చేస్తున్నాడు. యాపిల్ స్కాన్ సెంటర్లో ఎంబీబీఎస్ రెన్యూవల్ లేకపోగా మరో డాక్టర్‌కు తెలంగాణ కౌన్సిల్లో అనుమతి లేదు.
శ్రీకృష్ణ ఆసుపత్రిలో అర్హత ఉన్న డాక్టర్ లేకపోగా శ్రీకృష్ణ ఆస్పత్రిలో తెలంగాణ రిజిస్ట్రేషన్ లేదు. అల్ట్రా సౌండ్ సిస్టం ఏపీ ప్రభుత్వ వైద్యాధికారి పేరిట అనుమతలు ఉండగా ఆ వైద్యాధికారి ప్రస్తుతం ఆంధ్రాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటికి ఎలా అనుమతులు ఇచ్చారో వారికే తెలియాలి. వీటిలో జిల్లా వైద్యాధికారి ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అని మీడియా ప్రశ్నిస్తే అనుమానించాల్సిందే కదా అని డాక్టర్ నరేశ్ చెప్పారు. నెలనెలా వస్తున్న లక్షలాది రూపాయలు పోతాయనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ అధికారి మధ్య వర్తిత్వం వహించి శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సీజ్ చేయకుండా ఉండేలా రూ.25 లక్షల నుంచి కోటిన్నర వరకు నిర్వాహకుల నుంచి ఇప్పటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే అదునుగా భావించిన పోలీసులు సైతం తమకు డబ్బులు రావాల్సిందేనని డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్కానింగ్ సెంటర్‌పై కేసు నమోదు చేశారు. సంబంధిత శాఖనే పట్టించుకోకుండా మేనేజ్ చేసుకుంటే పోలీసులు డబ్బులు డిమాండ్ చేయడంతో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను ఆశ్రయించి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతోనే డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇంతటి అవినీతి రాజ్యమేలుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా పాలనా యంత్రాంగం కళ్లు మూసుకొని ఉండడం పట్ల ఆశ్చర్యం కల్గిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా మరీ విచ్చలవిడిగా మారిన అవినీతికి అడ్డుకట్ట వేసి అనుమతులు లేకుండా నడుస్తున్న ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేసి జిల్లా పరువును కాపాడాలని పలువురు కోరుతున్నారు.