– నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 18 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ పెంపు దిశగా కృషి చేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం పెంచి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. కార్పొరేషన్‌లోని అన్ని శాఖల అధికారులు, ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బంది, వార్డు అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు ఆదాయ వృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై కమిషనర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు షేడ్ నెట్ ఏర్పాటు చేయుటకు అనువైన క్రుదేశాలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి సోమవారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదే విధంగా పట్టణంలోని ప్రధాన ప్రదేశాల్లో సమ్మర్ వాటర్ పాయింట్లు (చలివేంద్రాలు) వెంటనే ఏర్పాటు చేసి ఈరోజు నుంచే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పట్టణంలోని అన్ని శ్మశాన వాటికలలో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని ఓపెన్ జిమ్‌లను గుర్తించి మరమ్మతులు, ఆయిలింగ్, గ్రీసింగ్, బోల్ట్ ఫిట్టింగ్ తదితర పనులు చేపట్టి వారం రోజుల్లో ప్రజల వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్, ఆస్తిపన్నుపై 5 శాతం రిబేట్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా వార్డు అధికారులు ప్రజలను ప్రోత్సహించాలని ఆదేశించారు.
అలాగే అండర్ అసెస్మెంట్, ఆన్ అసెస్మెంట్ ఆస్తులను గుర్తించి సైట్ రివిజన్ నిర్వహించి పన్ను పరిధిలోకి తీసుకురావాలని, డోర్ నంబర్లు లేని ఇళ్లను గుర్తించి వెంటనే డోర్ నంబర్లు కేటాయించి పన్ను వసూళ్లు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులు, నీటి పన్ను వసూళ్లు, పెన్షన్ దరఖాస్తులు సహా సంబంధిత వార్డుకు సంబంధించిన అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పి.అశోక్, కార్తీక్, అసిస్టెంట్ ఇంజినీర్లు దిలీప్, అసీం బాబా, ప్రవీణ్, శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి, రెవెన్యూ అధికారి శివరాం రెడ్డి, టీఎంసీ శ్రీనివాస్, వార్డు అధికారులు పాల్గొన్నారు.