నల్లగొండ, జులై 05 : సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ అని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సహచర్యం, సమాలోచన, సాధన, సమిష్టితత్వం, సంఘటితత్వం సూత్రాల ఆధారంగా ఏర్పడ్డ సహకార వ్యవస్థ దేశానికి ఎనలేని సేవలు అందించిందని తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖ, ఎన్సీడీసీ ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ గైకొన్న చర్యలు వాటి ఫలాలపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసిఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్ గణేషన్, ఎన్ సి డి సి రీజనల్ డైరెక్టర్ శార్దూల్ జాదవ్, జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ పత్యానాయక్ హాజరై ప్రసంగించారు.
ఎంజీయూ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైతం సహకార సంఘాల ఏర్పాటును విశ్వవిద్యాలయం పరిశీలించనుందని ఎన్సీడీసీ సహకారంతో వారిలో నాయకత్వ లక్షణాలు, దార్శనికత, సృజనను పెంపొందించేందుకు కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆర్జించిన జ్ఞానానికి సామాజిక స్పృహను జోడించి వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయుక్తమైన ఆవిష్కరణలు గావించాలని సూచించారు.
ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ శార్దూల్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్సీడీసీ ద్వారా వ్యవసాయం, రిటైల్ వాల్యూ ఎడిషన్, మార్కెటింగ్, ట్రేడింగ్, స్టోరేజ్ వంటి అనేక అంశాల్లో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీడీసీ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునే పద్ధతులను యువత ఉపాధికి, వ్యాపారానికి ఉన్న అవకాశాలను తెలియజేశారు. ఐసీఎం డైరెక్టర్ డాక్టర్ గణేషన్ మాట్లాడుతూ.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న 60 కార్యచరణ అంశాల ద్వారా సహకార వ్యవస్థలో అనేకమైన సంస్కరణలు సాధ్యమైనట్లు తెలిపారు. ఐసిఎం ద్వారా అవగాహన కార్యక్రమాలతో పాటు డిప్లొమో కోర్సులు సైతం అందించనున్నట్లు, ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువతకు చేరవేసే ప్రతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం సెమినార్ చైర్మన్ ఆచార్య ఆకుల రవి సహకార వ్యవస్థ చరిత్రను, డాక్టర్ శ్రీదేవి సహకార వ్యవస్థ మహిళా సాధికారతపై, రిటైర్డ్ అధికారి పి.నరసింహారెడ్డి కోపరేటివ్ వ్యవస్థలో అవకాశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Nalgonda : సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ : ఎంజీయూ వీసీ