రామగిరి, సెప్టెంబర్ 15 : బాలికపై అత్యాచారం కేసులో దోషికి 21 ఏండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ నల్లగొండలోని పోక్సో కేసుల కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. 11-02-2018 న చిట్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(8) ఇంట్లోకి దోమల రాములు అనే వ్యక్తి ప్రవేశించి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణలో దోషిగా తేలాడు. దీంతో సోమవారం ADJ-II కమ్ SC/ST కోర్టు & అత్యాచారం పోక్సో కేసుల కోర్టు దోషికి 21 సంవత్సరాల జైలు, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో సరైన సాక్ష్యాదారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి దోషికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సిఐ పాండురంగారెడ్డి, ఎస్ఐ సైదాబాబు, ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి, నల్లగొండ డీఎస్పీ, శాలిగౌరారం సిఐ నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్ఐ రవి కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సీడీఓ యాదయ్య, లైజన్ అధికారులు, లీగల్ ఆఫీసర్, భరోసా సెంటర్ కె.కల్పన, పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ ను ఎస్పీ అభినందించారు.