సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చినా పాలనను గాడిన పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లంచాలు, కమీషన్ల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి తిప్పించుకుంటున్నారని, కమీషన్లు ఇస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారని ఏకంగా సెక్రటేరియట్‌లోని ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిద్శనమని పేర్కొన్నారు. సూర్యాపేటలోని క్యాంప్ ఆఫీసులో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
నేడు రాష్ట్రంలో అరాచకమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, సౌకర్యాలను కొనసాగించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, కేవలం డబ్బులు దోచుకోవడం, లంచాలు, కమీషన్ల కోసమేనన్నట్లు వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. చేసిన పనులకు బిల్లులు తీసుకునేందుకు కాంట్రాక్టర్లు రూట్లు దేవులాడుకుంటున్నారని, పది నుంచి 20శాతం వరకు కమీషన్లు అడగడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలన్నా, తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని స్థితికి చేరుకున్నారన్నారు.
గతంలో కర్ణాటకలో బహిరంగంగా కమీషన్ తీసుకోవడంతో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు మార్చారని, దురదృష్టవశాత్తు తెలంగాణలోనూ అదే కమీషన్ల వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. ఎక్కువ కమీషన్ వస్తుందని పెద్ద కాంట్రాక్టర్లు కొద్దిమందికి మాత్రమే బిల్లులు ఇస్తున్నట్లు చిన్న కాంట్రాక్టర్లు వాపోతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. ఈ కమీషన్ల అంశం సహా ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకాదని, ప్రజలను చంపడమే గానీ బతికించడం చేతనవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15రోజులుగా గోడలకు చెవులు పెట్టి విని రావడం తప్ప ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏమీ చేయలేదన్నారు. ఇతర రాష్ర్టాల కార్మికులు కావడంతో వస్తే వచ్చిండ్రు.. లేదంటే పోయిండ్రు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.