నల్లగొండ, ఆగస్టు 29: అధికార పార్టీ…ఆపై కాంట్రాక్టర్..ఇంకేముంది అందింది రోడ్డు..ఇంకా ఆగేదేముందు అనుకున్నాడో ఏమో గానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిర్మాణాన్ని షురూ చేశాడు. డిజైన్‌లో ఉన్న విడ్త్(వెడల్పు)కు మంగళం పాడి…పరీక్షలు చేయని ఒండ్రు, నల్ల మట్టిని వాడి…పాత కల్వర్టులనే కొత్త కల్వర్టులుగా చూపిస్తూ ఆగమేఘాల మీద సదరు కాంట్రాక్టర్ చందనపల్లి-ఇండ్లూర్ రోడ్డును నిర్మిస్తున్నాడు. భూ ఉపరితలానికి రెండు ఫీట్ల నుంచి మీటరు వరకు పోయాల్సిన సీసీ రోడ్డులో అప్పటికే ఉన్న క్వాలిటీలెస్ మట్టిని తీయకుండానే రాళ్లతో మేనేజ్ చేసి అడ్డమైన రాళ్లు వేసి నిర్మాణం చేస్తే ఎన్నాళ్లు ఈ రోడ్డు ఉంటదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అధికార పార్టీ నేతలకు తాయిలాలు ఇచ్చి ప్రతిపక్ష నేతల గోడును పట్టించుకోకుండా నిర్మించే ఈ రోడ్డు అధికారుల పర్యవేక్షణాలోపంతోనే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అధికారులతోపాటు క్వాలిటీ కంట్రోల్ యంత్రాంగం పట్టింపులేని తనం వల్ల విడ్త్‌లో, మందంలో తేడాలు ఉండటం గమనార్హం.
చందనపల్లి-ఇండ్లూరు రోడ్డు నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నిధులు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా మంత్రి కోమటిరెడ్డి ఆ రోడ్డు పనులకు రీ ఎస్టిమేషన్ వేసి గతేడాది మార్చి 8న రూ.26.50కోట్లతో నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ పనులకు టెండర్లు వచ్చినప్పటికీ తిమ్మిని బమ్మి చేసి దక్కించుకున్న అధికార పార్టీ నేత బేస్‌లెస్‌గా సీసీ నిర్మాణం చేస్తున్నాడు. భూ ఉపరితలంలో క్వాలిటీ లెస్‌గా ఉన్న మట్టిని తీసి స్ట్రెంథన్ చేయకుండానే అక్కడ ఉన్న రాళ్లతో కవర్ చేయటంతోపాటు పజ్జూర్, వెంకటాద్రి పాలెం, యర్రగడ్డగూడెం, ఇండ్లూర్ గ్రామాల నుంచి చెరువుల్లో ఉన్న మట్టిని తీసుకొచ్చి నింపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఐబీ నుంచి అనుమతి ఇచ్చారని గ్రామస్తులు చెవులు కుట్టి రోడ్డుకు నల్లని ఒండ్రు మట్టి వాడటం విశేషం. బీటీ లేదా సీసీ రోడ్డు నిర్మాణంలో చెరువుల్లోని నల్లని ఒండ్రు మట్టితోపాటు చౌట మట్టి, మొరం వాడే సమయంలో పాత మట్టికి కొత్త మట్టికి బాండింగ్, మాయిశ్చర్ లాంటివి తేడా చూసేందుకు సీబీఆర్తోపాటు ఎస్బీఎస్ పరీక్షలు కూడా చేయాల్సి ఉన్నప్పటికీ చేయకుండానే నిర్మాణం చేస్తున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవటం వారి కాసుల కక్కుర్తే అని తెలుస్తుంది.
రూ.26.50కోట్లతో నిర్మిస్తున్న ఈ రోడ్డు 66ఫీట్ల విడ్త్(వెడల్పు)తోపాటు 11.2 కి.మీ. లెన్త్‌లో నిర్మాణం చేయాల్సి ఉం డగా అక్కడక్కడ రోడ్డు విడ్త్ కుదింపు చేసి పోస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పలు వత్తిళ్లు లేదంటే ఆర్థిక లావాదేవీలు చూసుకొని కొందరి భూముల దగ్గర ఈ విడ్త్ తగ్గిస్తున్నారు. 11.2 కి.మీ. నిడివిలో జరిగే ఈ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి పాత కల్వర్టులు పాత రోడ్డు సర్ఫేస్ను బట్టే నిర్మాణం చేశారు. కొత్తగా నిర్మాణం జరగే ఈ డబుల్ రోడ్డులో ప్రస్తుత భూ ఉపరితలాన్ని బట్టి రెండు పీట్ల నుంచి మీటర్ వరకు రోడ్డు హైట్ పెరుగుతుంది. ఈ నేపధ్యంలో పాత కల్వర్టులను తొలగించి కొత్త కల్వర్టులను నిర్మాణం చేయాల్సిన కాంట్రాక్టర్ పాత వాటితోనే మేనేజ్ చేస్తుండటంతో పెరిగే రోడ్డు వల్ల పాత కల్వర్టులు రోడ్డుకి కిందికి అయ్యాయి. పైగా పాత కల్వర్టులే బలంగా ఉన్నాయని ఆర్అండ్బీ అధికారులు అనటంతో వారిని ఏ స్థ్దాయిలో మేనేజ్ చేశారో స్పష్టమైతుంది.
ఆరంభంలోనే పనుల క్వాలిటీని గమనించిన అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్‌ను కలిసి క్వాలిటీ లెస్‌గా నిర్మాణం చేస్తున్నావెందుకని నిలదీసినట్లు సమాచారం. పైగా చెరువు మట్టి వాడటంతో వారు అభ్యంతర చెప్పారట. దీంతో ఆయా గ్రామాల నేతలకు పెద్ద ఎత్తున సదరు కాంట్రాక్టర్ తాయిలాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నా యి. వీరితోపాటు ఆర్అండ్బీ, క్వాలిటీ కంట్రోల్ యంత్రాంగంతోపాటు ఐబీ యంత్రాంగానికి కూడా కాసుల వర్షం కురిసిందట. ఇంకేముంది ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేత లు చెప్పినా పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణం నడుస్తుంది.
చందనపల్లి-ఇండ్లూర్ రో డ్డును ఆగమాగంగా నిర్మిస్తున్నారు.. 66ఫీట్ల రోడ్డు పోయాల్సి ఉంటే అక్కడక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ల భూములు పోకుండా విస్తీ ర్ణం తక్కువ చేసి పోస్తున్నా రు. రోడ్డు పోసేటప్పుడు కింద రాళ్లు, రప్పలు ఉంటే వాటిని కనీసం తొలగించి పోయకుండా అట్లాగే పోస్తే చాలా కాలం ఎలా ఉంటది. పైగా ఇక్కడ మొత్తం ఒండ్రు మట్టి అయిన మా గ్రామంలోని ఎర్రగుంట నుంచే రాత్రి రాత్రికి తీసి పోశారు.
– సింగిరికొండ రాధాకిషన్, పజ్జూర్, తిప్పర్తి మండలం
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చందనపల్లి-ఇండ్లూర్ రోడ్డును నిర్మిస్తున్నాం. మట్టిని ఎక్కడి నుంచి తెచ్చారు అనేది మాకు సంబందం లేదు. ఆ మట్టిని క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్లు పరీక్షిస్తారు. అదేవిధంగా పాత కల్వర్టులు బలంగా ఉండటంతో అవే ఉంచారు. ప్రస్తుతం మట్టి పోసి కంకర పనులు చేస్తున్నాం. కంకర పూర్తి కాగానే సీసీ రోడ్డు వేస్తాం. పైగా వాళ్లు మట్టి ఎక్కడ నుంచి తెచ్చినా సీనరేజ్ కట్ అవుతుంది.
-గౌస్, ఏఈ ఆర్అండ్బీ