దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రి పూట పడుకోవడానికి ఇబ్బంది పడే వారికి, అనాథలు, అభాగ్యుల కోసం ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి పట్టణంలో ఇందుకోసం నిరాశ్రయుల భవనం నిర్మిస్తున్నది. రూ.45 లక్షలతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫర్నిచర్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి వస్తే ప్రారంభానికి సిద్ధం కానున్నది. పట్టణంలో చాలావరకు అనాథలు, మతిస్థిమితం లేనివారు రోడ్డు వెంట నిద్రిస్తుండగా ఈ భవనం వారికి ఎంతో ప్రయోజనం కలిగించనున్నది. ఈ భవనంలో ఉండడానికే కాకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యం కూడా కల్పించనున్నారు.
భువనగిరి అర్బన్, డిసెంబర్ 4 : భువనగిరి పట్టణానికి పరిసర, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రిళ్లు పడుకునేందుకు, అనాథలుగా మారి రోడ్లపై నిద్రిస్తున్న అభాగ్యులు తలదాచుకునేందుకు భువనగిరి మున్సిపాలిటీలో నిరాశ్రయుల భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో 2020 అక్టోబర్ 2న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బిల్డింగ్ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తికాగా ఫర్నిచర్ ఏర్పాటు పనులు మాత్రమే మిగిలాయి.
యాచకులు, అనాథలు, మతిస్థిమితం లేనివారు భువనగిరి పట్టణంలోని ప్రధానదారి పక్కన, రోడ్ల వెంట, షాపుల ముందు, బస్టాండ్, రైల్వేస్టేషన్, రైతుబజార్, వివేకానంద విగ్రహం, హోటళ్ల వద్ద సంచరిస్తుంటారు. వీరు ఎక్కడ చీకటైతే అక్కడే నిద్రిస్తుంటారు. చలికాలం, వానకాలంలో వీరికి కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు లేకపోవడం గమనార్హం. ఒంటిపై దుస్తులు కూడా సరిగా ఉండవు. వీరి కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించే ఈ భవనం అందుబాటులోకి వస్తే కడుపునిండా భోజనం, కంటి నిండా నిద్రపోయేందుకు మంచి వసతి దొరకనున్నది.
పట్టణంలో రోజు రోజుకూ రోడ్ల వెంబడి నిద్రిస్తున్న నిరాశ్రయులు పెరిగిపోవడంతో వారికి కడుపునిండా భోజనం, నిద్రించేందుకు చోటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి సీడీఎంఏ భువనగిరి మున్సిపాలిటీకి అప్పగించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రహదారి బంగ్లా ముందు రూ.45 లక్షలతో భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనంలో ఒకేసారి 40 నుంచి 50 మంది నిద్రించేలా పెద్ద హాల్, భోజన గది ఏర్పాటు చేశారు. పట్టణంలో సంచరిస్తున్న యాచకులు, నిరాశ్రయులను ఈ భవనానికి తీసుకురావడానికి మెఫ్మా ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ టీమ్ సభ్యులు ప్రతి రోజూ పట్టణంలో తిరిగి వారిని గుర్తించి ఈ భవనంలో చేర్పించాల్సి ఉంటుంది. వీరికి ప్రతి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టనున్నారు. అలాగే వారికి దుప్పట్లు అందించి చలి, వర్షం నుంచి రక్షణ కల్పించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వారికి ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించనున్నారు.
భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఫర్నిచర్ కోసం రూ.6 లక్షల వరకు అంచనా వేసి సీడీఎంఏకు పంపించాం. నిధులు మంజూరు కాగానే ఫర్నిచర్ తీసుకొచ్చి భవనాన్ని ప్రారంభిస్తాం. ఆ తర్వాత పట్టణంలోని నిరాశ్రయులను గుర్తించే ప్రక్రియను మెఫ్మా సిబ్బందికి అప్పగించి ఇందులో చేర్చే బాధ్యతను సంబంధిత అధికారికి అప్పగిస్తాం.
-ఎన్నబోయిన ఆంజనేయులు, మున్సిపల్ చైర్మన్, భువనగిరి