కట్టంగూర్, ఆగస్టు 15 : అనారోగ్యం కారణంగా తనువు చాలించిన మిత్రురాలి జ్ఞాపకార్థం తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో కళా వేదిక నిర్మించి పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన భూపతి స్వాతి అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించింది. అయితే ఆమె జ్ఞాపకార్థం ఏదైనా సామాజిక కార్యక్రమం నిర్వహించాలని ఆమె స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాము చదువుకున్న అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతి జ్ఞాపకార్థం ప్రత్యేక కళా ప్రాంగణం నిర్మించారు. ఇందుకు అయిన సుమారు రూ.లక్షను 2012-13 (10వ తరగతి)కి చెందిన భూపతి స్వాతి జ్ఞాపకార్ధం ఆమె స్నేహితులు విరాళాల రూపంలో అందజేశారు. శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మిత్రురాలికి నివాళులర్పించడంతో పాటు కొత్తగా నిర్మించిన కళా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుముల సైదులు, ఉప సర్పంచ్ పొన్న శిరీషా సురేష్, ప్రధాన ఉపాధ్యాయురాలు కందాల రమ, వ్యాయామ ఉపాధ్యాయుడు సీహెచ్. పుల్లయ్య, స్వాతి భర్త భూపతి సైదులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.