హుజూర్నగర్, ఏప్రిల్ 20: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అభాసుపాలవుతోంది. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా వేపలసింగారం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే అధికారుల అండతో గ్రామంలోని అర్హులైన పేదలకు ఇండ్లు దక్కక పోగా, అక్రమార్కులకు దక్కాయి.
పేదల కడుపు కొట్టి..
వేపల సింగారంలో సుమారు 280 ఇండ్లను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేశారు. మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ఉంటుందని అంతా భావించారు. కానీ వాస్తవాలు చూస్తే విస్తుగొల్పే నిజాలు బయటపడ్డాయి. 30 ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్క డ ఇండ్లు కేటాయించారు. నిరుపేదలైన లబ్ధిదారుల సంఖ్య చేతివేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి పడిపోవడం గమనార్హం.
ఇండ్లు కావు.. గోదాములు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70 గజాల విస్తీర్ణం లో ఇండ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇక్కడ కొం దరు అక్రమార్కులు తమకు వచ్చిన ఇంటితో పాటు పక్కవారి ఇంటిని కొనుగోలు చేసి విలాసవంతమైన ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇందుకోసం సదరు వ్యక్తులకు రూ.లక్ష నుంచి లక్షా 50 వేల వరకు ము ట్టజెప్పి మధ్యలో తాత్కాలిక గోడలు కట్టి మమ అనిపించారు. ఆ ఇండ్లు నివాస యోగ్యంగా కాకుండా ధాన్యం, సిమెంటు బస్తాలను నిల్వ చేసుకునే గోదాములుగా మారిపోయాయి. పేదలకు నీడ ఇవ్వాల్సిన పథకం ధనికులు ధాన్యం దాచుకునే గోదాములుగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీ నేతల వసూళ్ల దందా..
గ్రామంలో జరిగే అక్రమాల వెనుక మండల స్థాయి అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని గ్రామస్తు లు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఇల్లు మంజూరు చేయించడానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూ లు చేసినట్లు తెలుస్తున్నది. సుమారు 150 ఇండ్ల లబ్ధిదారుల వద్ద వీరు వసూళ్లు చేపట్టినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గతంలో మేళ్లచెర్వు కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి పేరు మీద కూడా ఇల్లు మంజూరు కావడం స్థానిక నాయకుల వసూళ్ల దందాకు నిదర్శనం.
మంత్రి దృష్టి పెట్టరా..
పైలట్ ప్రాజెక్టులోనే ఇంతటి కుంభకోణం జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండటం వెనుక మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గ్రామంలో కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, పార్టీ కార్యకర్తలకే ఇండ్లు కట్టబెట్టే క్రమంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ మొదలు కాకముందే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామంలో జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇల్లు అందేలా చూడాలని, అవినీతికి పాల్పడిన నాయకులు, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేపలసింగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.