నల్లగొండ రూరల్, ఆగస్టు 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజకీయ పార్టీలు ఇచ్చేది కాదు, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఇవ్వాలి. లేకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్లబొల్లి మాటలు చెప్పి బీసీలను మభ్య పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. బీసీలకు మోసం చేస్తే చూస్తూ ఊరుకోమని, మా వాటా కోసం మేము ఎంతటి పోరాటానికైనా బీసీ సమాజం సిద్ధంగా ఉందన్నారు.
బీసీ బిల్లుల అమలు విషయమై ప్రజా పోరాటంతో పాటు న్యాయపోరాటం కూడా చేయాల్సి ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 25వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్ కృష్ణన్న గారు సత్యగ్రహ దీక్ష హైదరాబాద్ కేంద్రంలో చేపడుతారన్నారు.
ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, రచయితలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున హాజరై సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ , గద్దల మధు ,దన్నంపల్లి హరీష్ , కాడ శివ, కీసర నరేష్ , మొగిలిచర్ల నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.