అడ్డగూడూరు, నవంబర్ 2 : అరవై ఏండ్ల అణచివేత వైపు ఉంటారా తొమ్మిదిన్నరేండ్ల అభివృద్ధి వైపు నడుస్తారా ప్రజలు అలోచించుకోవాలని తుంగతుర్తి నియోజక వర ్గబీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవికాల్వ, ధర్మారం, గోవిందాపురం, మనాయికుంట, గట్టుసింగారం, జానకిపురం, చిన్నపడిశాల, చౌళ్లరామారం గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజక వర్గంలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నరేండ్లలో రూ.3 వేల కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అడ్డగూడూరును మండలం చేయడం, మానాయికుంట బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు.
అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి లక్ష్మీదేవికాల్వ వరకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం జరుగుతున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలు బునాదిగానీకాల్వ నుంచి ధర్మారం వరకు అందించనున్నట్లు చెప్పారు. నియోజక వర్గంలో 50 వేల మందికి ఆసరా పింఛన్లు, 95 వేల మందికి రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందుతున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు కేసీఆర్ బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు, గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధు దశాల వారిగా అర్హులైన వారికి అందజేయనున్నట్లు తెలిపారు. తిరిగి అధికారంలోకి వస్తే అసరా పింఛన్లు రూ.5,016 ఇస్తామని పేర్కొన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మోజార్టీతో తనను మరోమారు గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు మాత్రమే గ్రామాల్లోకి వచ్చే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం నుంచి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ అభివృద్ధి జరిగింది మాత్రం శూన్యం అన్నారు. ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి జరుగుతున్నట్లు చెప్పారు. మోత్కూరుకు పోస్టుమార్టం దవఖానా, అగ్నిమాపక కేంద్రం ఎమ్మెల్యే మంజూరు చేయించినట్లు తెలిపారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అయితే నియోజక వర్గానికి కిశోర్‌కుమార్ రక్ష అని కావునా మూడోసారి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, నాయకులు పూలపల్లి జనార్దన్‌రెడ్డి, చిత్తలూరి నరేశ్, జక్కుల యాదగిరి, కడారి సైదులు, మేకల జగన్, బాలెంల విద్యాసాగర్, చిగుళ్ల రమేశ్, కొప్పుల సోమిరెడ్డి, మెట్టు భాస్కర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.