కట్టంగూర్, ఏప్రిల్ 06 : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధంగా అమలు చేసి పట్టణ ప్రాంతాల్లో పనులను కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్ చేశారు, సోమవారం కట్టంగూర్ మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు.
2005లో వ్యవసాయ కూలీల పోరాడి సాధించుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్ జి అనే కొత్త బిల్లు తీసుకొచ్చి ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20, 21న జిల్లా వ్యాప్తంగా తాసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన, మే 15న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట చేపట్టే ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారంగి రమణ, మంగా మహేశ్వరీ, రాములు, భద్రం లక్ష్మి, తోటకూరి యాదమ్మ, సైదమ్మ, సురగి రేణు, సరోజన, లక్ష్మమ్మ పాల్గొన్నారు.