నల్లగొండ, ఆగస్టు 4 : రాజకీయ కక్ష, ఈర్షాద్వేశాలతోనే జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని మంత్రి అధికారులను ఆదేశించిన దానిపై ఒక ప్రకటనలో కంచర్ల ఘాటుగా స్పందించారు. నల్లగొండలో గత ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే భూమి కొనుగోలు చేసి నిర్మించినట్లు తెలిపారు.
పార్టీ ఆఫీసు నిర్మాణానికి గత కమిషనర్ దేవ్సింగ్కు దరఖాస్తు చేసుకుంటే అసలు ఏ పార్టీ ఆఫీసుకు అనుమతి లేదని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అయితే కోమటిరెడ్డి అనుమతి పేరుతో అధికారులను ఒత్తిడి చేస్తుంటే, ప్రస్తుతం తీసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే అధికారులను భయపెట్టి అనుమతులు ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పారు. అనుమతి తీసుకుంటామని, నిబంధనల ప్రకారం 33 శాతం ఫైన్ కూడా కడుతామని అంటే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అసలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ఆఫీసుల్లో దేనికి కూడా అనుమతి లేదని, కొన్ని ఆఫీసులకు అసలు పేపర్లే లేవని తెలిపారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన గాంధీభవన్కే అనుమతి లేదని, పార్టీ కార్యాలయాలు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలకు దేవాలయాల లాంటివని పేర్కొన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా తెచ్చిన నిధులకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి కోమటిరెడ్డి కాలం గడుపుతున్నారని అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, పార్టీ ఆఫీసు జోలికి వస్తే చర్యలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు.