నల్లగొండ నమస్తే తెలంగాణ, మార్చి 17 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్‌ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ కలెక్టరేట్ దగ్గర అంగన్వాడి ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఐసీడీఎస్ ను, అంగన్వాడి ఉద్యోగుల హక్కులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐసీడీఎస్ నిర్వీర్యం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఐసీడీఎస్ రక్షణ కోసం తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన కనీస వేతనం రూ.18,000 ఈ బడ్జెట్లో ప్రతిపాదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన కోరారు. అదేవిధంగా అంగన్వాడి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. కానీ ఆమె మాట తప్పి రూ.50 వేలకు కుదించడం చాలా అన్యాయమన్నారు. మినీ అంగన్వాడి ఉద్యోగులకు 10 నెలల నుండి వేతనాలు చెల్లించకుండా పస్తులు ఉంచినట్లు చెప్పారు. వెంటనే జీతాలు ఇవ్వాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎన్ఈపీ అమలు చేసే సంవత్సరాల పిల్లలను విద్యాశాఖలో విలీనం చేసి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసి ధ్వంసం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఐసిడీఎస్ ను దూరం చేసే కుట్రలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంగన్వాడి ఉద్యోగులకు టీఏ, డీఏలు, కులగణన లెక్కలు, బీఎల్ఓల సర్వేల డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే మే నెలలో టీచరు- ఆయాలకు సెలవులు ప్రకటించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ధర్నా అనంతరం 23 కోరికలతో కూడిన డిమాండ్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు.
ఈ మహా ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యతో పాటు అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా వర్కింగ్ అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి బి.పార్వతి, ఉపాధ్యక్షులు మన్నెమ్మ, సైదమ్మ, కె.రజిత, పరిపూర్ణ, సరిత, సుభాషినలీ, సునంద, దాడి అరుణ, ప్రమీల, స్వప్న, పద్మ, స్వరాజ్యం, అరుణ, ఎల్లమ్మ, యాదమ్మ, అరుణ, సీఐటీయూ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, పోలె సత్యనారాయణ పాల్గొన్నారు.
ICDS : ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి