చండూరు, జనవరి 22 : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మద్యానికి బానిసై కన్ను మిన్ను కానక స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫొటో ఉన్న మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్పియో వాహనంలో మున్సిపాలిటీ విధుల్లో చక్కర్లు కొడుతూ రాష్ డ్రైవింగ్ తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మూడు రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. బుధవారం స్థానిక యూనియన్ బ్యాంక్ ముందు నుండి అతివేగంతో దూసుకెళ్లి వెనకాలే ఉన్న వైన్స్ గేటును గుద్దుకుంటూ లోపలికి వెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మిమ్మల్ని ఇక్కడ వైన్స్ ఎవరు పెట్టమన్నారు, తాము రాజన్న అనుచరులం, ఇక్కడ వైన్ షాప్ పెట్టినందుకు తమకు డబ్బులు ఇవ్వాలంటూ షాపులో పనిచేసే కస్తాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పిడిగుద్దులతో తీవ్రంగా దాడి చేశారు.
ఇది మా రాజన్న అడ్డా.. తాము అడిగినప్పుడల్లా మద్యం ఇవ్వాలి అని మద్యం దమ్కీ ఇచ్చారు. దాడి జరుగుతున్న సమయంలో మద్యం దుకాణం నిర్వాహకులు డయల్ 100కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఎంతగా వారించినా వినకుండా పోలీసులనే అసభ్యంగా దూషించినట్లు సమాచారం. వీరికి పూర్తిగా ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఎవరు కూడా వీళ్లకు ఎదురు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ఎవరికి ఫిర్యాదు చేయకుండా భయపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి పరిస్థితులు తెలుసుకుని వారిని కట్టడి చేయకపోతే ప్రశాంతంగా ఉండే మున్సిపాలిటీ ఇబ్బందికరంగా మారుతదని ప్రజలు అనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఇదే వ్యక్తులు మున్సిపాలిటీలోని స్తంభాలకు మంత్రి రాజన్న అనే బ్యానర్లు కట్టి కలకలం రేపారు.

Chandur : చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం