మిర్యాలగూడ, సెప్టెంబర్ 28 : మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రాజకీయ చైతన్యానికి పేరొందిన మిర్యాలగూడలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ హవాను కొనసాగించిన ఈ నియోజకవర్గంలో నాయకుల పార్టీ ఫిరాయింపులతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గం గులాబీమయంగా మారింది. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న అధికార పార్టీ ఆ పార్టీ నేతనే ఎమ్మెల్యేగా ఉండడంతో రాజకీయ చక్రాన్ని తిప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే గులాబి నాయకులు, కార్యకర్తలుగా మారిపోయారు. ఆ సమయంలో పట్టు కోసం పాకులాడిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో సత్తా చాటడంతో మళ్లీ అధికారంలో వార్ మొదలైంది.
పాత, కొత్త అనే నినాదంతో నాయకులు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో తన పట్టు కోసం రాజకీయ వ్యూహంలో భాగంగా తనకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన నాయకులను అణచివేసే పనిలో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో అధికార పార్టీలోనే రోజుకో పరిణామం చోటు చేసుకోవడంతో ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
ఎమ్మెల్యే వర్సస్ ఛైర్మన్
మిర్యాలగూడ నియోజకవర్గానికి ఆయువు పట్టుగా ఉన్న మిర్యాలగూడ పట్టణంలో 48 వార్డులు ఉన్నాయి. 90వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఈ పట్టణంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఛైర్మన్ పట్టు కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా అదే పార్టీ నుంచి గెలుపొందారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 18 మంది కౌన్సిలర్లు బీఎల్ఆర్ తరఫున ఉన్నారు.
మరొక బీఆర్ఎస్ కౌన్సిలర్, మరో కమ్యూనిస్టు పార్టీ కౌన్సిలర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్యే వర్గంలో కౌన్సిలర్ల సంఖ్య 23కు చేరుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మున్సిపల్ చైర్మన్‌తోపాటు ఆయన వర్గానికి చెందిన 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. వారి చేరికను ముందునుంచే వ్యతిరేకించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులతోపాటు మిర్యాలగూడకు చెందిన డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ కూడా వ్యతిరేకించినా.. పార్టీ పెద్దల సూచనల మేరకు ఒకే చెప్పాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచే అసలు కథ మొదలైంది.
సభా వేదికలపై అవమానం.. దూరంగా ఛైర్మన్
ఎమ్మెల్యే, చైర్మన్ మధ్య వార్ వాతావరణం ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో బహిర్గతం అవుతున్నది. సభా వేదికలపైకి మున్సిపల్ ప్రధమ పౌరుడు అయిన చైర్మన్‌ను పిలువకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15న ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేయగా అక్కడికి హాజరైన చైర్మన్ భార్గవ్‌ను సభా వేదికపై పిలువకపోవడంతో అవమానానికి గురయ్యాడు. ఇటీవల పట్టణంలోని వై జంక్షన్ వద్ద రూ.150కోట్లతో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ల బ్రిడ్జి శంకుస్థాపనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరు కాగా.. ఆ వేదికపై ఉన్న ఫ్లెక్సీలో ఛైర్మన్ ఫొటోను ప్రత్యేకంగా ఓ బాక్స్‌లో వేసి అతికించినట్లు ఉండడం పలువురు చర్చించుకున్నారు.
ఆ కార్యక్రమానికి చైర్మన్ హాజరు కాలేదు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చైర్మన్‌కు తెలియకుండా మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సబ్ కలెక్టర్‌ను ఆహ్వానించి సమస్యలను చెప్తే పరిష్కరిస్తామని, పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి నెం.1గా మార్చాలని సూచించారు. ఆ సమయంలో ఛైర్మన్ మాటను ఎవరూ వినవద్దని, తాను చెప్పిన విధంగానే చేయాలని అధికారులకు, సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దాంతో చైర్మన్ శుక్రవారం అత్యవసరంగా సాధారణ సమావేశం నిర్వహించారు.
కౌన్సిల్ సభ్యులను ఆహ్వానించగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఎజెండా లోపభూయిష్టంగా ఉందని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. వారితోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా వాకౌట్ చేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య వార్‌ను మరింత బహిర్గతం చేస్తున్నాయి.
మున్సిపాలిటీలో ఆధిపత్యం కోసం..
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా.. ప్రస్తుత ఎమ్మెల్యే బీఎల్ఆర్ అప్పుడు కౌన్సిలర్‌గా గెలిచి కౌన్సిల్ సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. పదేండ్లుగా మిర్యాలగూడ మున్సిపల్ పీఠంపై అధికారాన్ని చెలాయించి ఇబ్బందికర ధోరణిని భార్గవ్ ప్రదర్శించడంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు సైతం గుర్రుగా ఉన్నారు. కాగా, ఇదే కౌన్సిల్లో కౌన్సిలర్‌గా ఉన్న బీఎల్ఆర్నే ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో తనకు వ్యతిరేకంగా ఉన్న చైర్మన్‌ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పదేండ్ల పాటు ఏకఛత్రాధిపత్యం సాగించిన ఛైర్మన్‌ను ఇప్పుడు నామమాత్రపు ప్రజాప్రతినిధిగా మార్చారు. మున్సిపల్ సిబ్బందితోపాటు అధికారులు వద్ద ఆయన మాట చెల్లుబాటు కాకుండా కట్టడి చేశారు. అంతా తన కనుసన్నల్లోనే నడువాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరిం పెరిగింది.