‘పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తాం. తడిసిన ధాన్యాన్ని కొంటాం. ప్రతి రైతునూ ఆదుకుంటాం’ గురువారం ఖమ్మం పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్న మాటలివి.
‘సమగ్ర పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా మేమే చెల్లిస్తాం’ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది. పంట నష్టపరిహారం విషయంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నది. భారీ వర్షాలకు పంట నష్టం జరిగినప్పుడు హడావిడి చేసి.. ఆ తర్వాత చేతులెత్తేస్తున్నది. ఇప్పటి వరకు ఒక పైసా కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గతంలో వర్షాలు కురిసి.. పంటలు ఆగమైనప్పుడు కంటి తుడుపు చర్యగా కేవలం పరిహారం ప్రకటన చేసింది. ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తామని పేర్కొంది. వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. కాంగ్రెస్ సరారు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. పంటనష్టం ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి భరోసా కల్పించిన దాఖలాలు కూడా లేవు.
పంటనష్టం కారణంగా అప్పులు తీర్చలేక రైతులు, కౌలు రైతులు దికుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు చేసిన పంటలు ఏపుగా పెరడంతో యూరియా, ఇతర రసాయన ఎరువుల కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో అంతా వర్షం పాలైంది. పరిహారం అందించిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు పంటల బీమా పథకాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేతులెత్తేసింది. గత వానకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని గప్పాలు కొట్టినా అమలు చేయలేదు. రెండేండ్లు కావస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పంటల బీమా అమలు చేయడంతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఉలుకూపలుకు లేకుండా మిన్నకుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సరారు నిర్లక్ష్యంతో రైతులు పంట నష్టపరిహారానికి నోచుకోవడం లేదు.
ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఆఖరికి కన్నీరే మిగులుతున్నది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పంటలు సాగు చేస్తే కష్టమంతా వర్షార్పణమవుతున్నది. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో వరి, పత్తి, ఇతర పంటలు నీటమునుగుతున్నాయి. వేలాది ఎకరాలు ఆగమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో వెయ్యి ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లింది. ఇటీవల వర్షాలకు వెయ్యి ఎకరాలకు పైనే పంట దెబ్బతిన్నది. దీంతో ఒకో రైతు వేలు, లక్షలు నష్టపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంట నష్టపరిహారం ఇవ్వడం లేదు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పదేండ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. సాగు నీరు, పెట్టుబడి సాయం, ఎరువులు, మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు సైతం సజావుగా కొనసాగాయి. పంట నష్టం జరిగిన సమయంలో రైతులను ఆదుకునే ప్రయత్నం చేసింది. 2023లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. జిల్లాలో రూ.7 కోట్ల సాయం అందించి రైతులపై ఉన్న ప్రేమను చాటుకుంది.
అప్పోసొప్పో తెచ్చి పంటలు పండించినా వరుణుడు కరుణించలేదు. జిల్లాలో తరచుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. రైతులు అప్పుల పాలై దికుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకసారీ పంట నష్టపరిహారం చెల్లించకపోవడం సిగ్గుచేటు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.