కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో రెండుగా చీలిన ఆ పార్టీలో కమిటీల ప్రకటన కల్లోలం రేపింది. మండలాలు, పట్టణాల అధ్యక్షుల నియామకం చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని ఏకంగా ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్ గాంధీ భవన్లో ఆందోళనకు దిగారు. నియామక ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి కారును అడ్డుకున్నారు. కుంభం అనిల్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి అనిల్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో పార్టీ వ్యవహారం రచ్చకెక్కింది.
యాదాద్రి భువనగిరి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : భువనగిరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు అధ్యక్షులను నియమిస్తూ బుధవారం మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆయన కారును స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారు ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించారు. అనిల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడి వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని, కోమటిరెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీలు, టీడీపీ నుంచి వచ్చిన వారికి ఏ విధంగా పదవులు ఇస్తారని మండిపడ్డారు. ఈ నియామకాలు పూర్తిగా అప్రజాస్వామికమని, ఎలాంటి సంప్రదింపులు లేకుండా చేశారని, కనీసం స్థానిక ఎంపీ, పీసీసీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా ఎలా నియమిస్తారని ఫైర్ అయ్యారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ నియమాలను పాటించకుండా, తన సొంత ఎజెండాను అమలు చేస్తూ, తన తాబేదారులకు పార్టీ విధి విధానాలపై ఎలాంటి అనుభవం లేని వాళ్లకు ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా నియమించిన కమిటీలను రద్దు చేయాలని, అనిల్‌ను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మరింత తారాస్థాయికి వర్గపోరు..
భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ పోరు తార స్థాయికి చేరుకుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలతో పార్టీలో క్రమశిక్షణ లోపించింది. భట్టి యాత్రతో ప్రారంభమైన వర్గ పోరు ఇప్పడు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల కుంభంకు వ్యతిరేకంగా వరుసగా సమావేశాలు నిర్వహించి.. అసమ్మతి గళం ఎత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా పార్టీ కేడర్ అసహనం చెంది.. గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు.
మునుగోడు నుంచి పాల్వాయి స్రవంతి ఆందోళన
నల్లగొండ ప్రతినిధి, జూలై 6(నమస్తే తెలంగాణ) : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల కమిటీల భర్తీ ఆ పార్టీలో చిచ్చు రేపుతుంది. కమిటీల్లో స్థానం దక్కని నేతలు ఆందోళనకు దిగారు. ఏకంగా గాంధీభవన్‌లోనే రచ్చ చేశారు. వివరాల్లోకి వెళితే.. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల కమిటీలను నియామకం చేశారు. ఇందులో ఒక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో నియోజకవర్గ మండల కమిటీల్లో తమ వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదని పాల్వాయి స్రవంతి తన వర్గీయులతో కలిసి గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. కేవలం చల్లమళ్ల కృష్ణారెడ్డి చెప్పిన వారికే మండల కమిటీల్లో స్థానం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని నిలదీసేందుకు యత్నించారు.