రామగిరి (నల్లగొండ), ఏప్రిల్ 02 : గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే వేతనాలు జమ అయ్యేలా చూడాలని అలాగే పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు.
బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నల్లగొండ జిల్లా కేంద్రంలో పొన్న అంజయ్య అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలతో, చాలీచాలని వేతనాలతో అవికూడా సకాలంలో రాక గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తామన్న వేతనాలు కార్మికుల ఖాతాలో కాకుండా కార్యదర్శులు డ్రా చేసి ఇస్తున్నారని దీనివల్ల వేతనాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించాలని, అర్హత కలిగిన వాళ్లను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో కార్మికులను వేధింపులను గురి చేస్తున్నారని వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న ఎంపీడీఓ ఆఫీసుల ముందు, 16న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 19 తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతపాక వినోద్ కుమార్, జిల్లా నాయకులు తిరిగి ఎల్లేశ్, గండమల్ల ఆశీర్వాదం, పి.సర్వయ్య, ఎండీ.జహీర్, కోటయ్య, కె.నరసయ్య, కె.మంగారెడ్డి, పాలడుగు చంద్రయ్య, ఎర్ర అరుణ, లింగయ్య, రాము, నరసింహ, ఎల్లయ్య పాల్గొన్నారు.