– చెరువును ఆక్రమించారంటూ నిరుపేదలకు నోటీసుల పేరుతో బెదిరింపులు
– బాధితుల పక్షాన న్యాయం పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 08 : ఐదు దశాబ్దాలుగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితులుగా అండగా పైసా ఖర్చు లేకుండా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని సాయిబాబా థియేటర్ వీధిలో చెరువును ఆక్రమించుకున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి నోటీసులు అందుకున్న బాధితుల ఇండ్లు తిరుగుతూ వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ ఏదో ఒక పేరు మీద ప్రజలను భయభ్రాంతులను చేస్తుందని, అందులో భాగంగానే ఈ నోటీసుల జారీ అన్నారు. తిరిగి వారిని మభ్యపెట్టినట్టు నటించి ఓట్లు దండుకోవడానికి ఈ ఎత్తుగడని ఆయన విమర్శించారు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్న నిరుపేదల ఇండ్ల ఒక్క ఇటుక కదిలించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
1,100 ఎకరాలు విస్తీర్ణం ఉన్న కోదాడ పెద్ద చెరువును బడా బాబులు అధికారుల అండదండలతోనే ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకోకుండా రోజువారి కూలి చేసుకుని పైసా పైసా కూడా పెట్టుకుని కొనుక్కున్న నిరుపేదలను ఆక్రమణదారులంటూ నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. ఆక్రమణలకు మున్సిపాలిటీ వారే బాధ్యులని బాధితుల పక్షాన వారే కోర్టుకెళ్లాలన్నారు. ఇంటి పన్ను, నాలా పన్ను, కరెంట్ బిల్లులు చెల్లించేటప్పుడు అధికారులకు ఆక్రమణ ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, మాజీ కౌన్సిలర్లు చింతల నాగేశ్వరరావు, మామిడి రామారావు, మేదర లలిత వెంకట్, నాయకులు గట్ల కోటేశ్వరరావు, కర్ల సుందర్ బాబు, ఉపేందర్, చీమ శ్రీను, రాజేశ్, చలిగంటి వెంకట్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Kodada : ‘ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త పన్నాగం’