నకిరేకల్, మే 3 : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గంలో తన ప్రయివేటు సైన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నాడని, తప్పును వేలెత్తి చూపిన వారిపై దాడులు చేయిస్తున్నాడని, రెండున్నరేండ్లలో ఫొటోలకు పోజులియ్యడం, రీల్స్‌తో హడావుడి చేయడం తప్ప రైతాంగానికి చేసేందేమీ లేదని, రైతుల రక్తం తాగుతున్న కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండవని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నకిరేకల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లలో పెత్తనం చెలాయిస్తున్న ఎమ్మెల్యే వీరేశం ప్రయివేటు సైన్యాన్ని తొలగించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీలు రైతుల సమస్యలపై చొరవ తీసుకుని పరిష్కారం చూపాలన్నారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం తన పర్సనల్ ఇంటలిజెన్స్ ద్వారా రిపోర్టు తెప్పించుకోవాలని కోరారు. కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాదని, అన్నీ పార్టీల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బీఆర్ఎస్ పక్ష రైతులకు సంబంధించినవి నెల రోజులైనా ఇంతవరకూ కాంటా పెట్టే పరిస్థితి లేదని, కొంతమంది బీఆర్ఎస్ సర్పంచులు ముందుకొచ్చి అడిగినా ఫలితం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సీరియల్స్ మెయింటెయిన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 10 రోజుల కింద వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు కానీ, నెలకు పైగా ఉన్న ధాన్యానికి మాత్రం కాంటా పెడతలేరన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రాత్రికి రాత్రే లారీల్లో దింపడం, ఉదయాన్నే కాంటా వేసి మిల్లులకు పంపుతున్నారన్నారు. ఈ దందాపై అధికారులు నోరు మెదపడం లేదన్నారు.
యాదాద్రి జిల్లా కలెక్టర్, జేసీ, ఆర్డీవో, పీడీలతో పదిసార్లు మాట్లాడినా కాంటా పెడతామని చెబుతున్నారే తప్ప ఇంతవరకూ ఇంద్రపాలనగరంలో కాంటాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట వేసిన మొదలు పండించిన పంటను అమ్ముకునే వరకూ అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్రం అంతటా పరిస్థితులు ఒకలా ఉంటే నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రం మరీ దారుణంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే వీరేశం ఒక నియంతలా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. తప్పును వేలెత్తి చూపిన అమాయకులపై దాడి చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే వీరేశం ప్రయివేటు వ్యక్తులతో ధాన్యం కొనుగోళ్లు చేయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే ఫొటోలకు పొజులు, రీల్స్ హడావుడి చేయడం తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. లారీలు సక్రమంగా రావడం లేదని, కాంటాలు సకాలంలో జరగడం లేదని ప్రశ్నించిన రైతులను తన్నిన సంఘటనలు నార్కట్‌పల్లి మండలంలో చోటుచేసుకున్నాయన్నారు. రైతులపై దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తక్షణమే యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పల్లె విజయ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, సీనియర్ నాయకులు పెండెం సదానందం, మాద లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, నాయకులు ఎమ్‌డి జాఫర్, ఎమ్‌డి అఖిల్, తదితరులు పాల్గొన్నారు.