నీలగిరి, జనవరి 4 : బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసం పెట్టారు. దీంతో మున్సిపాలిటీలో విశ్వాసం నిరూపించుకోవడానికి ఈ నెల 8న సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఆ పార్టీ గురువారం విప్‌ను జారీ చేసింది. నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉండగా.. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 20 స్థానాలను గెలుచుకున్నాయి.
బీజేపీ నుంచి ఆరుగురు, ఎంఐఎం నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు విజయం సాధించారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో నల్లగొండ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. చైర్మన్‌గా మందడి సైదిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే.. ఇటీవల శాసనసభ ఎన్నికలకు ముందు, ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. దాంతో వారి సంఖ్య 36కు చేరగా చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అవిశ్వాసానికి ఈ నెల 8న సమావేశం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది.
2019లో కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు కొత్తగా మున్సిపాలిటీల చట్టం రూపొందించింది. ఆ యాక్ట్‌లోని సెక్షన్ 37 ప్రకారం అవిశ్వాసం పెట్టడానికి సగం సభ్యుల కంటే ఒకరు ఎకువగా ఉండాలి. వారు జిల్లా కలెక్టర్‌కు నోటీసు ఇవ్వాలి. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ అవిశ్వాసం సమావేశం నిర్వహించేందుకు ఆర్డీఓ స్థాయి అధికారిని నియమిస్తారు. ఆ అధికారి సమావేశం నిర్వహించేందుకు తేదీని నిర్ణయించి సభ్యులకు, అవిశ్వాసం మోపబడిన వ్యక్తికి రాతపూర్వక నోటీసులు ఇస్తారు. సమావేశానికి హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతులు అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తితే అవిశ్వాసం ఆమోదించినట్లు.. లేదంటే వీగిపోయినట్లుగా ప్రకటిస్తారు.
అయితే.. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019లో కొన్ని ప్రొవిజన్స్ కల్పించబడ్డాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యులకు రూల్ 8 ప్రకారం విప్ జారీ చేసే అవకాశం ఉన్నది. విప్ నోటీసులను రాతపూర్వకంగా సభ్యులకు ప్రత్యక్షంగా గానీ, కుటుంబ సభ్యులకు గానీ అందజేస్తారు. అందుబాటులో లేకుంటే ఇంటికి గానీ అంటిస్తారు. అయితే.. చట్టసభల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు పార్టీ మారితే విప్ వర్తించదు. కానీ.. స్థానిక సంస్థల సభ్యులకు ఈ నియమ నిబంధనలు వర్తించవు. మొత్తానికి మొత్తంగా పార్టీ మారినా పార్టీ గుర్తుపై గెలిచిన వారందరికీ విప్ వర్తిస్తుంది. వారు విప్‌నకు అనుగుణంగా చేతులెత్తాల్సి ఉంటుంది. లేకుంటే వారంలోపే జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. 15 రోజుల్లో తిరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.