రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంటున్నది. ఏడాది పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండగా.. ఇక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం అదే దారిలో పయనిస్తున్నారు. కేసీఆర్ సర్కారు కంటే గొప్పగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్తే నమ్మి అధికారం కోసం కష్టపడితే ఇప్పుడు జరుగుతున్నది అందుకు పూర్తి భిన్నంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. కొత్త హామీల అమలు అటుంచితే.. కేసీఆర్ సర్కారులోని పథకాలను సైతం సరిగ్గా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రామసభల్లో మెజార్టీ గ్రామాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడమే అందుకు నిదర్శనం.
ఏడాది నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వక, రుణమాఫీ పూర్తి చేయక, రైతుబంధు ఇవ్వక, పెన్షన్లు పెంచక ఇలా ఏ హామీని కూడా పూర్తి చేయకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ నేతలు తలెత్తుకోలేక పోతున్నారు. దాంతో ఆ పార్టీ నేతలు ఇక లాభం లేదన్నట్లుగా రాజకీయంగా ప్రత్యామ్నాయం చూసుకునే పనిలో పడ్డట్లు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతున్నది. తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్దే ప్రత్యామ్నాయం అనే విశ్వాసంతో కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతుండడం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరికలు పెరుగుతుండడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నది. తాత్కాలికంగా అధికారంలో లేకపోయినా సరే భవిష్యత్ బీఆర్ఎస్‌దేనన్న విశ్వాసం కనపడుతుండడం గమనార్హం. అందుకే బీఆర్ఎస్లోకి క్రమక్రమంగా చేరికలు ఊపందుకుంటున్నట్లు తెలుస్తున్నది.. జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రానున్న కాలంలో ఈ చేరికలు మరింత ఉపందుకోవచ్చని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా గురువారం నల్లగొండ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి భారీ చేరికలు జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామ అధ్యక్షుడు దాసోజు రామాచారి, మరో నేత లేళ్ల సందీప్‌రెడ్డి సారథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఇంటికి తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీనీ వీడి భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. ఎన్నో ఆశలతో మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ప్రజలను గాలికి వదిలేశారని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంని పార్టీలో చేరిన నేతలు వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని కూడా వీరు స్పష్టంగా చెప్పారు.
నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూరులో యువజన కాంగ్రెస్ నేత పెద్ది మహేశ్‌గౌడ్ తన అనుచరులతో కలిసి గత అక్టోబర్‌లో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ అవరపల్లి సరిత, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి తమ అనుచరులతో కలిసి గత డిసెంబర్ 8న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చందంపేట మండలం గాగిళ్లాపురంలో మాజీ వార్డు సభ్యుడు బిజీలి సుధాకర్‌తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు.
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మాజీ ఉపసర్పంచ్ గోదల సురేశ్‌రెడ్డి, సురేశ్, చీమల శంకర్ బీజేపీ నుంచి, ఈర్ల శివ, రాజు, ముత్యాలు, సతీశ్ మరికొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ పాలననే రాష్ర్టానికి ప్రత్యామ్నాయమని భావిస్తూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సమక్షంలో మాజీ ఉపసర్పంచ్‌తోపాటు మిగతావాళ్లు బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సమక్షంలోనూ పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు.
నూతనకల్ మండలం వెంకేపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మారోజు ఏకాంబరాచారి గులాబీ కండువా కప్పుకొన్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలోని బీబీనగర్‌లో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఈ నెల 25న బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మల్లగారిశ్రీనివాస్తోపాటు బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల అశోక్‌తోపాటు వారి అనుచరులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. వీరినీ శేఖర్‌రెడ్డితోపాటు మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆహ్వానించారు.
ఇలా కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూస్తున్న వాళ్ల సంఖ్య పెద్దసంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది. గురువారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన పోల్‌లో సైతం 70శాతం మంది కేసీఆర్ పాలనకే జై కొట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న కాలంలో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ నేతలను డైలమాలో పడేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి చేరికలు మరింత ఉపందుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.