మోత్కూరు, ఫిబ్రవరి 21 : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఆ పార్టీలోని అసమ్మతివర్గం నుంచి నిరసన సెగ తప్పడం లేదు. గెలుపు కోసం అన్ని విధాలా పని చేసిన తమను పట్టించుకోవడం లేదని, మండల, గ్రామ కమిటీలకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో పర్యటించడం ఏంటని ప్రశ్నించారు. మండల పరిధిలోని బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో ఎమ్మెల్యే సామేల్ శుక్రవారం మండలంలోని సదర్సాపురం దగ్గర పూజలకు వచ్చారు.
ఎమ్మెల్యే సామేల్ వర్గం, అసమ్మతి వర్గం స్వాగతం పలికేందుకు గ్రామ పంచాయతీ సమీపంలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ‘మీ గెలుపు కోసం అన్ని విధాలా పని చేసిన మమ్మల్ని కాదని ఇటీవల పార్టీలో చేరిన వారిని ఎలా చేరదీస్తారు’ అంటూ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎఫ్ఎస్సీఎస్ మాజీ డైరెక్టర్ తీగల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎమ్మెల్యే సామేల్‌ను నిలదీశారు.
ఎమ్మెల్యే మాత్రం తన వర్గం వారితోనే కలిసి బిక్కేరులోని చెక్ డ్యామ్ వద్దకు వెళ్లి నీటిలో పసుపు, కుంకుమ, పూలను చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా మంత్రులు, మండల ముఖ్య నాయకులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్ల్లెక్సీని అసమ్మతి నేతలు కింద పడేసి చింపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మోత్కూరు మండల కార్యదర్శి బాలరాజు, అడ్డగూడూరు మండలాధ్యక్షుడు జోజి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లెర్ల భాస్కర్ పాల్గొన్నారు.