సూర్యాపేట టౌన్, జనవరి 6 : మార్పు తెస్తాం.. సంక్షేమ పథకాలకు డబ్బులు పెంచుతాం అంటూ అన్ని వర్గాల ప్రజలు, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు అందరినీ నట్టేట ముంచుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు పంట పెట్టుబడి సాయం 15 వేలు ఇస్తామని చెప్పి నేడు మాట మార్చి 12వేలు అనడం అన్యాయమన్నారు. ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ సోమవారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెట్టి రైతుభరోసాను ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నదన్నారు.
రుణమాఫీ కూడా సగం మందికి రైతులకు అందలేదని విమర్శించారు. రాష్ట్రంలో కోటీ 48లక్షల ఎకరాల భూమి ఉంటే 70లక్షల మంది రైతులు ఉన్నారని, వారందరికీ కేసీఆర్ రైతుబంధు ఇస్తే రేవంత్‌రెడ్డి వచ్చి సగం మందికి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేడని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టే రైతులందరికీ పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆ పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, జిల్లా నాయకులు గండూరి ప్రకాశ్, బత్తుల రమేశ్, ఆకుల లవకుశ, రాచకొండ కృష్ణ, జానకిరాం, కిషన్ పాల్గొన్నారు.