– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 26 : రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి చట్టపరంగా హక్కులు కల్పిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులపై అమానుష దాడులు జరుగుతున్నాయని, అందులో భాగంగానే కోదాడ దళిత బిడ్డ కర్ల రాజేష్ దుర్మరణం అన్నారు.
అందుకు సంబంధించి ఇప్పటివరకు అసలు దోషులను శిక్షించక పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ దంపతులు వ్యక్తిగతగా తనపై కక్ష సాధించేందుకే సీఎంఆర్ఎఫ్ రికవరీ విషయంలో తన పేరు చెప్పమని ఒత్తిడి చేయించడంలో భాగంగానే పోలీసుల చిత్రహింసలపాలై రాజేష్ మరణించాడన్నారు. రాజేష్ దుర్మరణానికి కారణమైన దోషులను శిక్షించాలని తాను చలో కోదాడ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కాగా తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు తన దిష్టిబొమ్మలు తగలబెట్టించినంత మాత్రాన బాధ లేదని, రాజేష్ మరణానికి కారణమైన దోషులను శిక్షించేంత వరకు విశ్రమించేది లేదని ఆయన పేర్కొన్నారు.