దేవరకొండ రూరల్, అక్టోబర్ 10 : బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు నమ్మక ద్రోహం చేసిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే నేపథ్యంలో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆర్డినెన్స్ జీఓను తెచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి, తమ సామాజిక వర్గం నాయకులతో హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే మీ సామాజిక వర్గం నాయకులతో సంప్రదించి కోర్టులో ఉన్న కేసులను విరమింపజేసుకోవాలని, 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. లేనియెడల బీసీ సమాజం మొత్తం ఐక్యమై ఉద్యమించి తమకు కావాల్సిన రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన దక్కించుకునేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చోళ్లేటి భాస్కరా చారి, వి.ఆర్మీ శ్రీను, రెడ్డి కోటేశ్వరరావు, కూరెళ్ల కృష్ణమాచారి, పతలావత్ లక్ష్మణ నాయక్, నల్లగ్లాసు కృష్ణ యాదవ్, రెడ్డి యాదయ్య, గడిగే అర్జున్, అప్పం వీరయ్య, గడ్డం భిక్షమయ్య, దామెర శాంసన్, తోటుపల్లి శ్రీను, భీమగోని శివగౌడ్, పల్స శ్రీనివాస్ గౌడ్, మేదర సంఘం వెంకటయ్య, పెరికేటి శ్రీనివాసాచారి, కృష్ణ ప్రసాద్, జ్యోతిబాసు, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి చందు నాయక్, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు జిల్లా రాములు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.