చండూరు, సెప్టెంబర్ 15 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం చండూరు తాసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో దివ్యాంగుల పెన్షన్ రూ.4 వేల నుండి రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి విధమైన పెన్షన్లు పెంచలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా నేత, గీత, బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్‌ను రూ.2,016 నుండి రూ.4,016కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా కండరాల క్షీణత కలిగినటువంటి వాళ్లకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కొత్త పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నల్లగొండ జిల్లా కార్యదర్శి నల్లగంటి రమేశ్, ఎంఆర్పీఎస్ చండూరు పట్టణ అధ్యక్షుడు ఇరిగి చరణ్, గంటెకంపు విజయ్ కుమార్, గంటెకంపు ఆదాము, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకారపు గణేశ్, పార్వతమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, బరిగల మారెమ్మ, పద్మమ్మ, దాసరి సువర్ణ, లక్ష్మయ్య, దండు వెంకన్న పాల్గొన్నారు.