యాదాద్రి భువనగిరి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు తోడ్పాటు లేక నేతన్నల పరిస్థితి దుర్భరంగా ఉండేది. పనిలేక, ఉపాధి కరువై.. తెచ్చిన అప్పులు, మిత్తీలు కట్టలేక అనేక మంది ఆత్మహత్యకు పాల్పడిన దుస్థితి. కానీ.. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేమితో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోతున్నది.
చేనేత కార్మికులు సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరెలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20వేల మంది చేనేత కార్మికులు ఉంటారు. భూదాన్ పోచంపల్లి, గట్టుప్పల్, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి, కొయ్యలగూడెం, చండూరు, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి చీరెలు అధికంగా ఉత్పత్తి చేస్తారు. అయితే.. పట్టు చీరెలు అంతంత మాత్రంగానే అమ్ముడుపోతుండటం, టెస్కో సరిగా కొనకపోవడంతో నేతలన్నకు ఇబ్బందులు తప్పడంలేదు.
చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద కూలికి మగ్గాలు నేస్తుంటారు. వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో ఉత్పత్తికి ముందుకు రావడంలేదు. దీంతో షావుకార్లు నేతన్నలకు పెద్దగా పని ఇవ్వడంలేదు. కొందరు పని కల్పిస్తున్నా కూలి డబ్బులు మాత్రం ఆలస్యంగా ఇస్తున్నారు. దీంతో నేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారుతున్నది. మరోవైపు గిరాకీ లేకపోవడంతో రూ.10వేలకు అమ్ముకునే చీరెను రూ.7వేల నుంచి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. చేనేత వస్ర్తాలను ఎప్పటికప్పుడు కొనాల్సిన టెస్కో కనీసం పట్టించుకోవడంలేదు. వస్త్ర నిల్వలు రూ.కోట్లల్లో పేరుకుపోవడంతో గిరాకీ లేక కార్మికులకు పని దొరుకడంలేదు. ఇటీవల కొనుగోళ్లు ప్రారంభించినా ఒక్కో చీరెపై రూ.800 తక్కువగా కొంటున్నట్లు వీవర్లు చెబుతున్నారు. దీంతో ఒక్కో వార్పునకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతున్నది.
ఇక్కత్ వస్ర్తాలు కాపీ..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరెల డిజైన్లకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పేటెంట్ హక్కు కలిగిన పోచంపల్లి చేనేత ఇక్కత్ పట్టు చీరెల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి.. పవర్ లూమ్లపై ప్రింటెడ్ పాలిస్టర్ చీరెలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇవి మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తుండడంతో పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరెలకు మార్కెట్ తగ్గుతున్నది.
చేనేతతోపాటు పవర్లూమ్స్ కూడా దీనస్థితికి చేరుకుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ తయారయ్యే పట్టు వస్ర్తాలతోపాటు పంచెలు, టవల్స్, లుంగీలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో పనిలేక ఉమ్మడి జిల్లాలో ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూరు, నల్లగొండ, నకిరేకల్ తదితర మండలాల్లో ఉన్న పవర్లూమ్ పరిశ్రమలు మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి.
పోచంపల్లికి ఐఐహెచ్టీ కలేనా!
భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు కలగానే మారుతున్నది. ఎన్నో వినతులు, విజ్ఞప్తుల తర్వాత తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఐఐహెచ్టీ మంజూరు చేసింది. ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామ పరిధిలో ఉన్న హ్యాండ్లూమ్ పార్క్లో భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 23 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐఐహెచ్టీ ఏర్పాటైతే అనేక విధాలుగా మేలు జరుగుతుంది. పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఐఐహెచ్టీ రాకపోగా, ఇక్కడే ఉన్న హ్యాండ్లూమ్ పార్కును కూడా తెరువడంలేదు.
చేనేత మిత్రకు సాయం బంద్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు సంబంధించిన పథకాలకు ఒక్కొక్కటిగా పాతర వేస్తున్నది. నేతన్నల కోసం బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన చేనేత మిత్ర పథకానికి మంగళం పాడింది. నేత కుటుంబానికి నెలకు రూ.3వేలు చెల్లించకుండా అటకెక్కించింది. గతంలో చేనేత మిత్ర పథకం కింద ప్రభుత్వం నూలు, రసాయనాలు, ముడి సరుకులకు సబ్సిడీ ఇచ్చేది.
నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై 40శాతం సబ్సిడీ కల్పించేది. అయితే సబ్సిడీ పొందడం నేతన్నలకు ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన నేతన్నలకు నెలకు రూ.30వేల సాయం అందించాలని నిర్ణయంచింది. కార్మికుల కుటుంబాలకే నేరుగా డబ్బులు జమ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా కూడా చెల్లించలేదు. పథకాన్ని బంద్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
‘త్రిఫ్ట్’ చెల్లింపులు పెండింగ్
నేతన్నలకు సామాజిక భద్రత కల్పించడం కోసం కేసీఆర్ సర్కారు చేనేత చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. నేత కార్మికుల నెలసరి చేనేత ఆదాయంలో ఎనిమిది శాతం ఆర్డీ1లో జమ చేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీ2లో 15శాతాన్ని నేరుగా జమ చేయాలి. ఆ మొత్తం నగదు వడ్డీతో సహా మూడేండ్ల తర్వాత కార్మికులకు అందుతుంది. ప్రస్తుత 2021-2024 సంవత్సరానికి గాను యాదాద్రి జిల్లాలో 11వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబ్బులు జమ చేయడమే మరిచిపోయింది. సెప్టెంబర్ నుంచి 11 నెలలుగా డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.25 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. కార్మికులు మాత్రం తమ వాటాను ఠంఛనుగా కడుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోకపోగా.. జీఎస్టీ పన్నుల మోతతో నేతన్నల నడ్డి విరుస్తున్నది. కేంద్రం నూలుపై 12శాతం, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండటంతో డబ్బులు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలో నేత కార్మికులకు పని దొరక్కపోవడంతో మళ్లీ వలసబాట పడుతున్నారు.