నల్లగొండ, జనవరి 20 : ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు పది రోజులే ఉండగా.. కొత్త పాలకవర్గాల ఎన్నికకు ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఫిబ్రవరి 1తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో పల్లెల్లో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించనున్నారా.. సర్పంచులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించి మరి కొంత కాలం నెట్టుకురానున్నారా? అనేది ఈ నెలాఖరుకు తేలనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి పల్లె పోరుకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హామీల అమలు కోసం ఇటీవల ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆరింటిని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. అప్పటికే పార్లమెంట్ ఎన్నికలు రానుండగా. వాటి తర్వాత పంచాయతీ పోరుకు వెళ్లే అవకాశముంది.
ఆరు గ్యారెంటీల అమలు, పార్లమెంటు ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ రిజర్వేషన్లు పాతవా.. కొత్తవి చేసి నిర్వహిస్తారా? అనే చర్చ పల్లెల్లో జోరుగా జరుగుతుంది. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గత ఎన్నికల ముందు చేసిన రిజర్వేషన్లను రెండు సార్లు అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో అసెంబ్లీలో చట్టం చేసింది. దాన్ని ఈ సారి కూడా అమలు చేయాల్సి ఉన్నది. కొత్త ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పాత రిజర్వేషన్లు అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత జూన్ లేదా జూలైలో పల్లె పోరు జరుగనుంది.
రిజర్వేషన్లు మార్చాలంటే మాత్రం మరోసారి చట్టం చేయాల్సి ఉన్నందున ఎన్నికలు మరికొంత ఆలస్యం కానున్నాయి. ఇదిలా ఉండగా బీసీ కమిషన్ ఇటీవల మూడు దఫాలుగా రాష్ట్రంలో గ్రామాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలు అడిగి బీసీ కోటా కింద ఏ మేరకు అమలు చేశారనే కోణంలో పరిశీలన చేసింది. పల్లె పోరును దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ టీ పోల్ యాప్‌లో ఎన్నికల సిబ్బంది వివరాలు అప్డేట్ చేయమని పంచాయతీరాజ్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇదే సంవత్సరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయక ముందే ఎన్నికలు వస్తే మాట తప్పిన ప్రభుత్వంగా నిలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం.. మార్చి మొదటి వారం నాటికి మరో నాలుగు గ్యారెంటీలు అమలు చేయాల్సి ఉన్నది. అందులో భాగంగానే ఇటీవల ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. గ్యారెంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లోగా పార్లమెంటు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉన్నందున పంచాయతీ పోరు జూన్ లేదా జూలైలో జరిగే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల గడువు ముగుస్తుండటంతో ఆయా గ్రామాల్లో ప్రత్యేక పాలన చేపట్టే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేటలో 475, యాదాద్రి భువనగిరిలో 421.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో 2019 జనవరి 24, 27, 30 తేదీల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎన్నికైన పాలకవర్గాలు ఫిబ్రవరి 2న సమావేశం నిర్వహించి కొలువు దీరగా.. ఫిబ్రవరి ఒకటితో వాటి గడువు ముగియనుంది. ఆ లోపే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది.
ఎన్నికల నిర్వహణకు కనీసం నెలన్నర ముందే ప్రభుత్వం సిద్ధ్దమైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసేది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడనందున ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. పంచాయతీల పదవీ కాలం పది రోజులే ఉన్నందున మరో ఆరు నెలలు పొడిగించాలని ప్రస్తుత పాలక వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సర్పంచుల అభ్యర్థ్దన మేరకు వారికే కొంత కాలం సమయమిచ్చి పర్సన్ ఇన్చార్జిలుగా నియమిస్తుందా.. లేదా ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తుందా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తే మండల స్థాయి ఆధికారికి బాధ్యత ఇవ్వనుంది.
జిల్లాలో 2019 జనవరి చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు జరుగగా.. ఫిబ్రవరి 1తో ప్రస్తుత పాలక వర్గాల గడువు ముగుస్తుంది. అప్పటి వరకు ఎన్నికలు జరుగకపోతే ప్రత్యేక అధికారుల పాలన లేదా పర్సన్ ఇన్చార్జిల పాలనా అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. జిల్లాలో 2006, 2013, 2019 సర్పంచ్ ఎన్నికల్లో బీసీ సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలు ఇటీవలే బీసీ కమిషన్ ఇవ్వాలని ఆదేశిస్తే వాటి వివరాలు సేకరించి అందజేశాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఎలక్షన్ సిబ్బంది వివరాలు టీ పోల్ యాప్‌లో అప్లోడ్ చేయమని అడిగింది. సర్పంచ్ ఎన్నికలపై మాత్రం ప్రభుత్వం నుంచి గానీ ఎన్నికల కమిషన్ నుంచి గానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– దేప విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ