త్రిపురారం, జనవరి 20 : ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం రుణమాఫీ ఎగ్గొట్టిందని, రైతు భరోసా ఇవ్వకుండా ఆగం చేస్తున్నదని అన్నారు. పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపున పెట్టుకొని కాపాడుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి రోడ్డున పడేసిందని తెలిపారు. సాగునీరు ఇవ్వక, సక్రమంగా కరెంట్ సరఫరా చేయక మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నదన్నారు. ప్రజాపాలన సమయంలో తీసుకున్న దరఖాస్తులు రోడ్లపాలు, చెత్తబుట్టల పాలయ్యాయని, ఇప్పుడు పథకాల అమలుపై గ్రామసభలు పెడతామనడం సిగ్గులేని చర్య అన్నారు.
గ్రామ సభల పేరుతో గ్రామాల్లోకి వచ్చే అధికారులను పథకాల అమలుపై నిలదీయాలని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వచ్చేదాక బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నల్లగొండలో రైతు మహా ధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తుంటే ప్రభుత్వానికి భయమేస్తుందని చెప్పారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్నయాదవ్, మాజీ సర్పంచ్ అనుమలు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, మాజీ రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండల సెక్రటరీ రయినబోయిన వెంకన్నయాదవ్, నాయకులు జంగిలి శ్రీనివాస్‌యదవ్, బైరం కృష్ణ, కాంతారావునాయక్, కలకొండ వెంకటేశ్వర్లు, దస్తగిరి, చింతకాయల యాదయ్య, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.