నల్లగొండ రూరల్, మే 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఏసీఏస్ ధాన్యం కొనుగోలు కేంద్రం తో పాటు బత్తాయి మార్కెట్లో ఏర్పాటు చేసిన ఎన్డీసీఎంస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, దండంపల్లిలోని మ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి నెల రోజులైనా ఇంకా తూకం వేయడం లేదని,..కొర్రీలు పెడుతున్నారన్నారు. ట్రక్ షీట్ వెంటనే ఇవ్వట్లేదని, బస్తాకు మూడు రూపాయలు వసూలు చేస్తున్నారని, తీరా మిల్లుకు వెళ్లిన ధాన్యంలో క్వింటాకు రెండు కిలోలు కట్ చేస్తున్నామని చెబుతూ… మళ్లి ట్రక్ షీట్లో మార్పులు చేసి, తమను అన్ని విధాల దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా, ధాన్యం ఎంత వస్తే అంత కొనుగోలు చేశారని, కాని నేడు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కయి రైతులకు నష్టం చేస్తున్నారని.. తూకం లో మోసం, లంచాలు, తమకిష్టమైన వారికే ముందుగా తూకం వేయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకొని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్లగొండ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నారబోయిన భిక్షం, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేశ్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేశ్, బాణోత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, దండంపల్లి సత్తయ్య, వజ్జ శ్రీను, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, లక్ష్మయ్య, కోట్ల జైపాల్‌రెడ్డి, ఉప్పల మురళి, దండంపల్లి సర్పంచ్ మల్లెబోయిన బుచ్చి రాజు, అల్లి వెం కన్న, నారబోయన నరసింహా, పనస శ్రీను, బొడ్డుపల్లి శ్రవణ్ ఉన్నారు.