సూర్యాపేట, మార్చి 30 : వైద్య ఆరోగ్యశాఖలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తలను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆశా కార్యకర్తలు ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశాలకు కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుతల వారీగా ఆశా కార్యకర్తల వేతనం పెంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. దీంతో కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా కార్యకర్తలకు నెలకు రూ. 18వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మట్టి ఖర్చులకు రూ. 50వేలు అందించి ఏఎన్సీ టార్గెట్లు ఎత్తి వేయాలని, జాబ్ చార్ట్‌లో లేని పనులు చెప్పవద్దని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డు, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. చనిపోయిన ఆశా కార్యకర్తల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆశా కార్యకర్తలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ కవిత, ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా నాయకులు జయమ్మ, సక్కుబాయి, కె.జయమ్మ, రమణ, బైనాబాయి, ఉమ, విజయ, ధనమ్మ, అలివేలు, పారిజాత, సైదమ్మ, భవాని, సువర్ణ, లక్ష్మి, నవ్య, లీలమ్మ, కమలమ్మ, పద్మ, శ్రీలత, శోభారాణి, రెహానా, ఉమ, విజయలక్ష్మి, నిర్మల, సావిత్రి, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు దంతాల రాంబాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు.