కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జంబో స్కీంలు అమలు చేస్తామని ప్రకటించి బొక్కబోర్లా పడింది. జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభిస్తామని చెప్పినా ముందుకు సాగలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కేవలం మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ విలేజీ అంటూ కొత్త ముచ్చటకు తెరలేపారు. ఏవేవో కారణాలు చెప్పి మండలంలో ఒక్క గ్రామానికే పరిమితం చేశారు. ఆ తర్వాత అమలు చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ అతీగతీలేదు. ఇప్పుడు కూడా గతంలోని సీన్ రిపీట్ అవుతుండటం విశేషం. అవతరణ దినోత్సవం రోజున పలు పథకాలకు శ్రీకారం చుడుతామని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు పథకాలే లేవంటూ తుస్సుమనిపించింది.
యాదాద్రి భువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ):‘జూన్ 2.. పథకాల పెద్ద పండుగ.. మిషన్ 26 కు ఆరంభం.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు.. స్కీం సాంక్షన్ ఆర్డర్లు..” ఇనీ కాంగ్రెస్ సర్కారు ఊదరగొట్టిన ఉత్తుత్త ముచ్చట్లు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కలెక్టరేట్ కార్యాలయాల్లో పలు పథకాలకు శ్రీకారం చుడుతామని ప్రగల్భాలు పలికింది. ఏదో చేసేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు పథకాల్లేవంటూ చివరికి తుస్సుమనిపించింది. సోమవారం పలు పథకాల ప్రారంభోత్సవాలు వాయి దా పడటంతో పథకాల అమలులో మరింత జాప్యం కానున్నది. జనవరిలోనూ జెండా వందనం రోజు ఇస్తామంటూ నమ్మబలికి.. పైలట్ గ్రామాలతో సరిపెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. రేషన్ కార్డు కలిగిన బడుగు బలహీన వర్గాల యువతతోపాటు ఈబీసీ, మైనారిటీలకు రూ.50వేల నుంచి రూ. 4లక్షల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి నియోజకవర్గానికీ 4,200 మందికి ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు 9,188 యూనిట్లు మంజూరు చేశారు. ఉమ్మడి నల్లగొండలో రాజీవ్ యువ వికాసానికి వివిధ వర్గాల నుంచి 1,78,060 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నల్లగొండలో 79,052, యాదాద్రి భువనగిరిలో 38, 904, సూర్యాపేటలో 60,104 దరఖాస్తులు స్వీకరించారు. మండలాల్లో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. జూన్ 2న ప్రారంభిస్తామన్న పథకాల్లో మొదటిదైన రాజీవ్ యువ వికాసం అమలుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
కొత్త రేషన్ కార్డులు సైతం పంపిణీకి నోచుకోవడంలేదు. అసలు ఆదివారం సాయంత్రం వరకు కొత్త కార్డులు ఇంకా జిల్లాకు చేరుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. యాదా ద్రి భువనగిరి జిల్లాలో సుమారు 97 వేల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 45వేలు వెరిఫై చేయగా, కొన్ని వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి కూడా మూడు నెలల సన్నబియ్యం ఇస్తామని ప్రభు త్వం చెబుతున్నా.. అసలు రేషన్ కార్డు లే రాకపోవడంతో ఎలా తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కాకుండా ప్రతి పథకానికీ రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయ లేదు. యాసంగిలో 50శాతం మందికి మాత్రమే డబ్బులు జమ చేసింది. నాలుగు ఎకరాల వరకు మాత్రమే పథకాన్ని వర్తింపజేసింది. మిగతా డబ్బులు జూన్ 2న బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రకటించింది. సోమవారమైనా రైతుల అకౌంట్లల్లో డిపాజిట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గతేడాది వానకాలం రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిందే.
కటిక దారిద్య్ర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మోక్షం కలుగడం లేదు. గూడు కట్టుకుందామనుకున్న పేదల కలలు కల్లగానే మిగిలిపోతున్నాయి. నెలల తరబడి పెండింగ్ పడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీలో జాప్యం నెలకొంటూనే ఉన్నది. జిల్లాలో పైలట్ గ్రామాల్లో మొదటి విడతగా 762 ఇండ్లు మంజూరయ్యాయి. వాటి నిర్మాణ పనులు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. రెండో విడతలో భాగంగా 8,191 మందికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే మండలాల వారీగా కేటాయింపులు పూర్తయ్యాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా జూన్ 2 మాత్రం పథకం అమలుకు నోచుకోవడం లేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గంలోని ఓ మండలంలో కొందరికి ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.