సూర్యాపేట, అక్టోబర్ 09 : కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ సూర్యాపేటలో జోరుగా కొనసాగుతుంది. గురువారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేటలో వాడవాడలా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రంగాల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పాలనపై కోపంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామని మాయమాటలతో ఆశలు పెంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు నల్లపాటి అప్పారావు, రేపల్లె ఉపేందర్, లతీఫ్, వట్టే లింగరాజు, వెంపటి శ్రీనివాస్, నాగరాజు, సుదర్శన్, సఫియా, ఆయూబ్ పాల్గొన్నారు.