మిర్యాలగూడ, జూన్ 9: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో 560 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికే నిర్మాణం పూర్తికావడంతో లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో ఇండ్లు కేటాయించారు. కాగా కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే మిగిలి ఉంది.
కాలనీలో అంతర్గత రోడ్లు మంచినీరు విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పనులను సాగదీస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆ పనులు పూర్తి కావొస్తుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యే ఎప్పుడో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగు వేయించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇండ్లకు కాంగ్రెస్ కలర్స్ వేయడం ఏమిటని పలువురు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇండ్ల నిర్మాణం మొత్తం పూర్తయినా కేవలం మౌలిక వసతుల కోసమే రెండున్నర సంవత్సరాలుగా సాగదీస్తూ లబ్ధిదారులకు అప్పగించకుండా నిర్లక్ష్యం చేయడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు కృషితో నిర్మాణమైన ఇండ్లకు ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ రంగులు వేయించడం పట్ల స్థానికులు, లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయించిన పనులను కూడా తమ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని పట్టణ ప్రజలు నవ్వుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వేసిన కాంగ్రెస్ రంగును తొలగించాలని, స్థానికులు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
